ఐఫోన్ తర్వాతి సిరీస్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ కానుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం కొత్త సిరీస్ లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ మోడల్స్ విడుదల కానున్నాయి. వీటిలో 1 టీబీ స్టోరేజ్ ఆప్షన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్స్‌లో 512 జీబీ స్టోరేజ్ ఉన్న విషయం తెలిసిందే. 9 టు 5 మాక్, వెడ్‌బుష్ సెక్యూరిటీస్, బ్లూమ్‌బెర్గ్ అనే సంస్థలు ఐఫోన్ 13 ఫోన్లకు సంబంధించి వేర్వేరుగా నివేదికలను అందించాయి. అయితే దీనిని సంబంధించి యాపిల్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.
లీకుల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి..
- ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (LiDAR) స్కానింగ్ టెక్నాలజీ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐ ఫోన్ 12 సిరీస్ ఫోన్లలో కేవలం ప్రో, మాక్స్ వెర్షన్లలో మాత్రమే లిడార్ సెన్సార్లను అందించారు. అయితే గతంలో రిలీజైన ఫోన్లలో మాదిరి కేవలం ప్రో వెర్షన్లలో మాత్రమే లిడార్ సెన్సార్లు ఉంటాయని ట్రెండ్ ఫోర్స్ అనే సంస్థ తెలిపింది. యాపిల్ తన 2021 ఐఫోన్ లైనప్‌లో లిడార్ స్కానర్లను అందించడం ద్వారా ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ని అప్ గ్రేడ్ చేయనుంది.
- ఐఫోన్ 13 ఫోన్లను 90 నుంచి 100 మిలియన్ల యూనిట్లలో సరఫరా చేయాలని సంస్థ భావిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ ఉత్పత్తి 80 మిలియన్ యూనిట్లకు చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐఫోన్ 13 ఉత్పత్తిని 20 శాతం పెంచాలని యాపిల్ భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో పేర్కొంది.
- వెడ్‌బుష్ అంచనా ప్రకారం.. ఐఫోన్ 13 సిరీస్.. ఐఫోన్ 12 సిరీస్‌తో సారూప్యంగా (చూడటానికి దాదాపు ఒకేలా) ఉండనుంది.
- ఐఫోన్ 13 సిరీస్.. యాపిల్ వాచ్‌లతో కలిపి రానుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇందులో ఫాస్టర్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండనున్నట్లు తెలిపాయి. ఇది పెర్ల్, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో రానున్నట్లు పేర్కొన్నాయి.
- ఐఫోన్ 13 ప్రో మోడల్ ఫోన్లు.. శామ్‌సంగ్ తయారు చేసిన 120 HZ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలతో వస్తాయని చెబుతున్నాయి.
- ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఫోన్లలో రేడియో ఫ్రీక్వెన్సీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (ఆర్‌ఎఫ్‌పీసీబీ) ఉండనుంది. అలాగే వీటిలో రీఫ్రెష్ రేట్ 120 HZగా ఉండనుంది.
- ఐఫోన్ 13 సిరీస్ ఏ15 బయోనిక్ చిప్ సెట్‌తో రానుందని తెలుస్తోంది. వీటిని టీఎస్ఎంసీ రూపొందించింది.
- ఐఫోన్ 13 ఫోన్లలో నాచ్ ఉండదని సమాచారం. నాచ్ లెస్ ఫోన్లను తయారుచేస్తున్నామని గతంలో యాపిల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త సిరీస్ ఫోన్లలో సాధ్యమైనంత వరకు నాచ్ ఉండదనే లీకులు వస్తున్నాయి.