టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 49కిలోల పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది భారత అథ్లెట్ మీరాబాయి చాను. తాజా సమాచారం ప్రకారం ఆమె రజత పతకం... స్వర్ణ పతకం అయ్యే అవకాశం ఉందట.
అది ఎలాగంటే... మహిళల 49 కిలోల పోటీల్లో చైనా క్రీడాకారిణి హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది.
49కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీలు ముగియడంతో చాను భారత్‌కు తిరిగి పయనమైంది. అదే విధంగా హు జిహూయిని కూడా చైనా వెళ్లేందుకు అనుమతి కోరింది. కానీ, నిర్వాహకులు ఆమెను ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. డోప్ పరీక్షలు నిర్వహించేందుకు ఆమెను అక్కడ ఉండాలని కోరినట్లు సమాచారం. ఒకవేళ ఆ పరీక్షల్లో ఆమె విఫలమైతే స్వర్ణం చేజారుతుంది. దీంతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్న మీరాబాయి చాను... మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన మీరాబాయి చాను... కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించింది. ఇందుకోసం చాను ఎన్న త్యాగాలు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 లక్షలతో అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో 50 రోజుల పాటు తీసుకున్న శిక్షణ తీసుకుంది. రియో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన చాను మూడు ప్రయత్నాల్లో విఫలమై ఒత్తి చేతులతో వెనుదిరిగింది. టోక్యోలో భారత్ నుంచి ఆడిన ఏకైక లిఫ్టర్ అయిన మీరా. 2018 కామన్వెల్త్ క్రీడలతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. స్నాచ్‌లో తడబడే అలవాటున్న మీరా.. అరోన్ హర్స్‌చిగ్ శిక్షణలో ఆ లోపాన్ని సరిదిద్దుకుని... ఇచ్చిన మాట ప్రకారం పతకం గెలిచి తానేంటో నిరూపించింది.
మీరాబాయి స్వస్థలంలో ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ శిబిరాలు లేవు. దాంతో ఆమె రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్ అనితా చాను వెదురు బొంగులతో సాధన చేయిస్తూ టెక్నిక్స్ నేర్పించేది. వెయిట్ లిఫ్టింగ్ ఖరీదైన క్రీడ. సాధకులకు నాణ్యమైన పోషకాహారం అవసరం. మొదట్లో ఆమె వారానికి రెండుమూడు సార్లు మాత్రమే కోడిగుడ్లు, మాంసం తినేది. కొన్నాళ్ల తర్వాత కొన్ని సంస్థలు ఆమెకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడంతో మరింత కఠోరంగా శిక్షణ మొదలు పెట్టింది.