టోక్యో ఒలింపిక్స్‌లో రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఇండియ‌న్ అథ్లెట్లు ఒక్కొక్క‌రూ ఉత్త చేతుల‌తో వెనుదిరుగుతున్నారు. తొలి రోజు మీరాబాయి చాను సిల్వ‌ర్‌తో మెర‌వ‌డం త‌ప్ప త‌ర్వాతి మూడు రోజుల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. పతకం తెస్తారనుకున్న క్రీడాకారులకి తీవ్ర నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితాలే వ‌చ్చాయి.


నాలుగో రోజైన మంగ‌ళ‌వారం కూడా ప‌రిస్థితి అలాగే ఉంది. మెన్స్ హాకీ టీమ్‌, బాక్స‌ర్ లవ్లీనా విజయాలు త‌ప్ప మిగ‌తా అన్నింట్లోనూ మ‌న‌వాళ్లు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. షూట‌ర్లు మ‌రోసారి తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. టేబుల్ టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌ల‌లోనూ ప్ర‌తికూల ఫ‌లితాలే వ‌చ్చాయి.


లవ్లీ విజ‌యం


మంగ‌ళ‌వారం చెప్పుకోద‌గిన విజ‌యం ఏదైనా ఉందంటే అది తొలిసారి ఒలింపిక్స్‌తో త‌ల‌ప‌డుతున్న బాక్స‌ర్ ల‌వ్లీనా విజ‌య‌మే. 64-69 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 32లో బై ల‌భించ‌డంతో ఆమె నేరుగా మంగ‌ళవారం జ‌రిగిన రౌండ్ ఆఫ్ 16లో త‌ల‌ప‌డింది. జ‌ర్మ‌నీ బాక్స‌ర్ న‌దైన్ అపెట్జ్‌పై 3-2తో విజ‌యం సాధించింది. ఆమె క్వార్ట‌ర్‌ ఫైన‌ల్లో గెలిస్తే చాలు సెమీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా ఇండియాకు మ‌రో ప‌త‌కం ఖాయం. బాక్సింగ్‌లో సెమీస్‌లో ఓడిన ఇద్ద‌రికీ బ్రాంజ్ మెడ‌ల్ ఇస్తారు.


హాకీ.. మ‌ళ్లీ విజ‌యాల బాట‌


మొన్న ఆస్ట్రేలియా చేతిలో 1-7తో చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా.. మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది. మంగ‌ళ‌వారం ఉద‌యం స్పెయిన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 3-0తో గెలిచింది. మ్యాచ్ మొత్తం ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది మ‌న్‌ప్రీత్‌సింగ్ సేన‌. గురువారం ఒలింపిక్ ఛాంపియ‌న్స్ అర్జెంటీనాతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.


వీటిలో నిరాశే


షూటింగ్‌: ఈసారి ఒలింపిక్స్‌లో షూట‌ర్ల వైఫ‌ల్యం కొన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన రెండు మెడ‌ల్ ఈవెంట్‌ల‌లోనూ మ‌న‌వాళ్లు క‌నీసం ఫైన‌ల్‌కు కూడా క్వాలిఫై కాలేక‌పోయారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్‌లో మ‌ను బాక‌ర్‌, సౌర‌భ్ చౌద‌రి జోడీతోపాటు అభిషేక్ వ‌ర్మ‌, య‌శ‌స్విని దేశ్వాల్ జోడీలు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించ‌లేదు. ఇక 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లోనూ దివ్యాంశ్ ప‌న్వ‌ర్‌, ఎల‌వెనిల్ వ‌ల‌రివ‌న్ జోడీ, అంజుమ్ మౌడ్గిల్‌, దీప‌క్ కుమార్ జోడీలు ఫైన‌ల్ చేర‌లేదు.


టేబుల్ టెన్నిస్‌: ఇండియ‌న్ స్టార్ ప్లేయ‌ర్ శ‌ర‌త్ క‌మ‌ల్ మూడో రౌండ్‌లో ఓడిపోయాడు. ఒలింపిక్ ఛాంపియ‌న్ మా లాంగ్ చేతిలో అత‌డు 1-4 తేడాతో పరాజ‌యం పాల‌య్యాడు.


బ్యాడ్మింట‌న్‌: మెన్స్ డ‌బుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు రెండో మ్యాచ్‌లో విజ‌యం సాధించినా క్వార్ట‌ర్‌ఫైన‌ల్‌కు క్వాలిఫై కాలేక‌పోయారు. మ‌రో మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ టాప్ సీడ్ ఇండోనేషియా జోడీపై గెల‌వ‌డంతో సాత్విక్‌, చిరాగ్‌కు నిరాశ త‌ప్ప‌లేదు.