క్రికెట్‌ అంటేనే ఫన్నీ గేమ్‌!! ఎంత జెంటిల్మన్‌ గేమ్‌ అనుకున్నా కొన్నిసార్లు గమ్మత్తు సంఘటనలు చోటు చేసుకుంటాయి. కేప్‌టౌన్‌ వేదికగా భారత, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులోనూ ఇలాంటిదే జరిగింది.


ఒకే జట్టులోని పది మంది బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో క్యాచ్‌ ఔట్‌ రూపంలోనే వెనుదిరిగారు. అవునా! అనుకోకండి!! కథ ఇంతటితో ముగిసిపోలేదు. అదే జట్టు రెండో ఇన్నింగ్సులోనూ మొత్తంగా క్యాచ్‌ ఔట్లతోనే పెవిలియన్‌ చేరిపోయింది. ఇప్పుడు మీకో సందేహం వస్తోంది కదూ! మీరు ఊహించింది నిజమే. అది మన టీమ్‌ఇండియానే మరి.


Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?


సాధారణంగా క్రికెట్‌ మ్యాచుల్లో ఆలౌట్‌ కావడం సహజం. పిచ్‌ కఠినంగా ఉన్నప్పుడు స్వల్ప స్కోర్లకే ఔటవుతుంటారు. ఆకాశం మబ్బులు పట్టి ఉన్నప్పుడు, బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కీపర్‌, స్లిప్‌లో క్యాచులు ఇస్తుంటారు. అయితే జట్టులోని ప్రతి బ్యాటర్‌ క్యాచ్‌ల రూపంలో వెనుదిరగడం అరుదే. ఒక ఇన్నింగ్స్‌లో అయితే ఫర్వాలేదు! ఒకే జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అలాగే పెవిలియన్‌ చేరిందంటే ఆశ్చర్యమే అనుకోవాలి. టీమ్‌ఇండియా కేప్‌టౌన్‌లో ఇలాంటి విచిత్రమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పైగా చరిత్రలో ఒక జట్టుకు చెందిన 20 బ్యాటర్లు ఇలా క్యాచ్‌ఔట్‌ అవ్వడం ఇదే తొలిసారి.


ఇంతకు ముందు ఒకే జట్టులోని 19 బ్యాటర్లు ఐదుసార్లు క్యాచ్‌ఔట్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. 1982/83 సీజన్లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్‌ జట్టులో 19 మంది క్యాచ్‌ఔట్‌ అయ్యారు. 2009/10లో సిడ్నీలో ఆసీస్‌ చేతిలోనే పాకిస్థాన్‌ ఇలా వెనుదిరిగింది. 2010/11లో దర్బన్‌లో దక్షిణాఫ్రికా మ్యాచులో టీమ్‌ఇండియాకు ఈ అనుభవం తొలిసారి ఎదురైంది. మళ్లీ ఆసీస్‌ కంచుకోట బ్రిస్బేన్‌లో 2013/14లో ఇంగ్లాండ్‌కు రెండోసారి దెబ్బపడింది. ఇదే కేప్‌టౌన్‌లో 2019/20లో ఇంగ్లాండ్‌ చేతిలో సఫారీ జట్టుకు ఈ రికార్డు తప్పలేదు!