Refugee Olympics Team 2024: విశ్వ క్రీడలకు సమయం సమీపిస్తోంది. నాలుగేళ్లుకు కఠోర శ్రమకు ఓర్చి.. ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుని సిద్ధమైన అథ్లెట్లు ఒలింపిక్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రీడల్లో పాల్గొని పతకం గెలిచి తమ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలన్న తపన అథ్లెట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వ క్రీడా సంరంభం జులై 26న ఘనంగా ప్రారంభం కానుంది. పారిస్ ఒలింపిక్స్ 2024ను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.

 

భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ ఈ విశ్వ క్రీడల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రీడల్లో ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 10 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. విశ్వ క్రీడలు ప్రారంభమయ్యే వేళ ఓసారి గత చరిత్రను నెమరు వేసుకుందామా..

 

ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో...

ఇప్పటి వరకు  ఒలింపిక్‌ క్రీడలను 20 దేశాలు నిర్వహించారు. 20 దేశాల్లోని 23 నగరాలు విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాయి. వింటర్ ఒలింపిక్ క్రీడలను 21 నగరాలు, 13 దేశాలు నిర్వహించాయి. సమ్మర్ యూత్ ఒలింపిక్ క్రీడలను 3 నగరాలు, 3 దేశాల్లో నిర్వహించారు. వింటర్ యూత్ ఒలింపిక్ క్రీడలను 4 నగరాల్లో నిర్వహించారు. మొత్తంగా ఒలింపిక్‌  క్రీడలను 47 నగరాలు, 27 దేశాలు, ఐదు ఖండాల్లో నిర్వహించారు. ఈ అయిదు ఖండాల్లో ఒలింపిక్ క్రీడలు, యూత్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించారు.

ఒలింపిక్స్‌కు రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిన తొలి ఆసియా దేశం జపాన్. ఒలింపిక్స్‌ క్రీడలను రెండుసార్లు నిర్వహించిన ఆసియా దేశంగా జపాన్ ఖ్యాతిని ఆర్జించింది. ఏథెన్స్, పారిస్, లండన్, సెయింట్ మోరిట్జ్, లేక్ విన్టర్, లాస్ ఏంజిల్స్ కూడా ఒలింపిక్స్‌ను రెండుసార్లు నిర్వహించాయి. ఒలింపిక్స్‌ను తొలిసారిగా 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో నిర్వహించారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తారు. 

 

ఎన్ని దేశాలు పాల్గొంటాయి? 

ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 206 జాతీయ ఒలింపిక్ కమిటీలకు చెందిన అథ్లెట్లు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో 196 ఒలింపిక్ కమిటీల నుంచి మొత్తం 10,672 మంది అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటారు. ఈ ఒలింపిక్‌ కమిటీల్లో ఒక్కో దేశానికి ఒక్కో కమిటీ ఉంటుంది. ఈ ఒలింపిక్స్‌లో 196 ఒలింపిక్ కమిటీలలో ఒలింపిక్ రెఫ్యూజీ టీమ్ కూడా ప్రత్యేక జట్టుగా ఉంటుంది. ఈ బృందంలో తమ దేశం నుంచి ఎటువంటి సహాయం పొందని అథ్లెట్లు ఉంటారు. తాలిబన్‌ పాలనలోని ముగ్గురు అఫ్గాన్‌ మహిళలు ఈ ఒలింపిక్‌ రెఫ్యూజీ టీంలో ఉన్నారు. రష్యా, బెలారస్‌ దేశాలకు ఒలింపిక్‌ కమిటీ గుర్తింపు ఇవ్వకపోవడంతో వారు తటస్థ ఆటగాళ్లుగా ఈ విశ్వ క్రీడల్లో తలపడనున్నారు.