టీమ్‌ఇండియాపై షాహిన్ అఫ్రిది చేసిందే తానూ చేస్తానని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అంటున్నాడు. త్వరగా వికెట్లు తీస్తే తమ విజయానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు. కోహ్లీసేన తమకు కఠిన సవాళ్లు విసరగలదని వెల్లడించాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ప్రపంచకప్ సూపర్ 12లో ఈ రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్. యాదృచ్ఛికంగా ఈ రెండు జట్లు వరుసగా పాకిస్థాన్ చేతిలోనే ఓటమి పాలయ్యాయి. గ్రూప్-2లోని బలమైన జట్లు కావడంతో ఈ మ్యాచులో గెలిచిన వారికి సెమీస్ వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
'బంతి ఎప్పుడిస్తారన్న దానిబట్టి నా ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికైతే నాకు ఎలాంటి ప్లాన్ తెలియదు. ఏ బౌలర్‌కు ఎన్ని ఓవర్లు ఇస్తారు? ఎప్పుడిస్తారో తెలియదు. టీమ్‌ఇండియాపై షాహిన్ బౌలింగ్ అద్భుతం. కోహ్లీసేన నాణ్యమైన జట్టు. త్వరగా వికెట్లు తీయడం పైనే మా దృష్టి ఉంది. ఏదేమైనా మేం కట్టుదిట్టంగా సరైన ప్రాంతాల్లో బంతులు వేయాలి. అదృష్టవశాత్తు బంతి స్వింగ్ అయితే షాహిన్ అఫ్రిది చేసిందే నేనూ చేస్తాను' అని బౌల్ట్ ధీమా వ్యక్తం చేశాడు.
టీమ్‌ఇండియా బలమైన జట్టు కావడంతో కఠిన సవాళ్లు ఎదురవుతాయని ట్రెంట్ బౌల్ట్ తెలిపాడు. మొదట బ్యాటింగ్ చేసినా, ఛేదనకు దిగినా తాము బంతితో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. 'బ్యాటింగ్, బౌలింగ్‌లో మేం మొదట ఏది ఎంచుకున్నా మెరుగ్గా చేయాలి. ఎందుకంటే భారత్ కఠినమైన జట్టు. సరైన వ్యూహాలు రచించి ముందుకెళ్లాలి. బంతితో రాణించాలి. మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ లక్ష్యం నిర్దేశించాలి. అలా చేస్తామనే ఆశిస్తున్నాం' అని బౌల్ట్ అన్నాడు.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి