SC on WFI Election: గత కొంతకాలంగా వరుసగా వాయిదాపడుతూ వస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలపై గువహతి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఎన్నికలలో తమకు కూడా ఓటింగ్ హక్కు కల్పించాలని కోరుతూ అస్సాం రెజ్లింగ్ సంఘం (ఏడబ్ల్యూఏ) దాఖలుచేసిన పిటిషన్ విచారణలో భాగంగా గువహతి కోర్టు జులై 28న విచారించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికలు అప్పటిదాకా నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను నిలిపివేయాలని గువహతి కోర్టు విధించిన స్టేను నిలిపేసింది.
వాస్తవానికి డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు చాలారోజులుగా వాయిదాపడుతూ వస్తున్నాయి. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది మే 7 న ఈ ఎన్నికలు నిర్వహించాలని భావించినా పలు కారణాల రీత్యా అది జూన్ 30కు వాయిదాపడింది. మళ్లీ ఆ తేదీ జులై 4కు మారింది. అప్పుడు కూడా వాయిదాపడి ఆరో తేదీన నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు.
కాగా తమకు ఈ ఎన్నికలలో ఓటు వేసే అధికారం కల్పించాలని కోరుతూ అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్.. గత నెలలో గువహతి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన విచారణ వాయిదాపడుతూ వస్తోంది. జులై 17న ఈ కేసులో విచారణ ఉన్నప్పటికీ డబ్ల్యూఎఫ్ఐ న్యాయవాది కోర్టు ఎదుట హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో గువహతి హైకోర్టు స్పందిస్తూ.. ఈనెల 26న అఫిడవిట్ దాఖలు చేయాలని, 28న విచారణకు హాజరుకావాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. దీంతో ఈనెల 28 వరకూ ఈ ఎన్నికలు జరిగే ఆస్కారం లేదని తేలిపోయింది.
కానీ ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ ఈ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని.. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘం తరఫున న్యాయవాది అనూజ్ త్యాగి సుప్రీంకోర్టులో ప్లీ దాఖలు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని గువహతి కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని అనూజ్ త్యాగి.. తన పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు వాదనలను విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, ఎస్. వి. భట్టిల ధర్మాసనం.. స్టే ను నిలిపేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు, డబ్ల్యూఎఫ్ఐకి, అస్సాం రెజ్లింగ్ సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial