Sunil Gavaskar:  సునిల్‌ గావస్కర్‌! అంతర్జాతీయ క్రికెట్లో మేరునగధీరుడు! వెస్టిండీస్‌లోని అతివీర భయంకర పేసర్లను హెల్మెట్‌ లేకుండానే ఎదుర్కొన్న వీరుడు. తొలి తరం క్రికెట్లోనే పదివేల పరుగులు చేసిన యోధుడు. సెంచరీల మీద సెంచరీలు చేసిన సన్నీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అంచనాలు అందుకోలేదు. 1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో అతనాడిన ఇన్నింగ్స్ అత్యంత చెత్త ఇన్నింగ్స్‌గా ముద్ర పడింది. నిజానికి ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందో తెలుసా?


Also Read: ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు - కేవలం బౌండరీలతోనే 308 - లారా సెన్సేషనల్ ఇన్నింగ్స్‌కు 28 సంవత్సరాలు


దశాబ్దాల తరబడి క్రికెట్ అంటేనే టెస్ట్ మ్యాచెస్ అన్న సమయంలో 1975లో తొలి వరల్డ్ కప్ జరిగింది. అందులో ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా. వన్డేల మజా ఏంటో ఫ్యాన్స్ కు తెలియచెప్పేలా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్  60 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వరల్డ్ కప్‌నకు ఆరంభం అదిరిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇండియా ఛేజింగ్ కు దిగిన దగ్గర్నుంచి మ్యాచ్  బోర్, బోరర్, బోరెస్ట్ గా మారిపోయింది. దానికి కారణం లెజెండ్ సునీల్ గావస్కర్ ఇన్నింగ్సే.



అంత భారీ ఛేజింగ్ లో ధాటిగా ఆడాల్సిన సన్నీ టెస్టుల కన్నా దారుణంగా ఆడాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి 174 బాల్స్ ఆడిన సునీల్ కేవలం 36 పరుగులే చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక్క బౌండరీ మాత్రమే కొట్టాడు. టీమిండియా ఫైనల్ స్కోర్... 132 పరుగులు మాత్రమే. 202 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. సునీల్ గావస్కర్ ఆడిన ఈ అత్యంత స్లోయెస్ట్ ఇన్నింగ్స్ పై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అతను ఆడిన తీరును అందరూ తప్పుబట్టారు. ఆ సమయంలో ఈ హారిబుల్ ఇన్నింగ్స్ గురించి ఏమీ మాట్లాడని సునీల్ గావస్కర్ కొన్నేళ్ల తర్వాత తన కెరీర్ లో అదే అత్యంత చెత్త ఇన్నింగ్స్ అని ఒప్పుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఔట్ అయిపోయినా బాగుండేదని అనుకున్నానని గావస్కర్ గుర్తు చేసుకున్నాడు. 1975లో సునిల్‌ గావస్కర్‌ ఈ ఇన్నింగ్స్ ఆడింది ఇదే రోజు (జూన్‌ 7) కావడం గమనార్హం.


Also Read: మట్టికోర్టుపై వార్ వన్‌సైడ్ - రూడ్‌ను చిత్తు చేసిన నాదల్ - 14వ ఫ్రెంచ్ ఓపెన్ కైవసం!