సరిగ్గా 28 సంవత్సరాల ఇదే రోజు బ్రియాన్ లారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. 1994 జూన్ 6వ తేదీన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. పాకిస్తానీ క్రికెటర్ హనీఫ్ మహ్మద్ రికార్డును (499) బద్దలు కొట్టాడు. ఈ రికార్డు సాధించి 28 సంవత్సరాలు గడిచినా ఆ తర్వాత ఎవరూ కనీసం 400 పరుగులు కూడా చేయలేకపోయారు.
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో బ్రియాన్ లారా ఈ రికార్డును సాధించాడు. వార్విక్‌షైర్ తరఫున ఆడిన లారా డర్హమ్ జట్టుపై ఈ రికార్డును సృష్టించాడు. కేవలం 427 బంతుల్లోనే లారా ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇందులో 62 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. అంటే మొత్తంగా 308 పరుగులను బౌండరీలు, సిక్సర్ల ద్వారానే సాధించాడన్న మాట. ఈ మ్యాచ్‌లో లారా నాటౌట్‌గా నిలవడం విశేషం.
అత్యధిక వ్యక్తిగత స్కోర్ల విషయంలో లారా రికార్డులు చాలానే ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోరు (400 నాటౌట్) కూడా లారా పేరు మీదనే ఉంది. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లారా ఈ రికార్డు సృష్టించాడు. లారా తర్వాతి స్థానంలో మాథ్యూ హేడెన్ (380) ఉండగా... మూడో స్థానం మళ్లీ బ్రియాన్ లారాదే (375).
1994లోనే 375 పరుగులతో లారా రికార్డు సాధించగా... 2003లో హేడెన్ 380 పరుగులు సాధించి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఆరు నెలలు తిరిగే సరికి బ్రియాన్ లారా 400 పరుగులు సాధించి తన రికార్డు మళ్లీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2006లో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్థనే ఈ రికార్డు చేరువగా వచ్చినా... 374 పరుగుల వద్ద అవుటై నిరాశ చెందాడు. తర్వాత ఇంకెవ్వరూ 350 పరుగులు కూడా చేయలేకపోయారు.
ఇంగ్లండ్‌పై ప్రత్యేక ప్రేమ
బ్రియాన్ లారా అత్యధిక స్కోరు సాధించిన రెండు సార్లూ ప్రత్యర్థి ఇంగ్లండే కావడం విశేషం. అంతే కాకుండా 501 పరుగులు సాధించి రికార్డుగా నిలిచిన ఇన్నింగ్స్ కూడా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోనే వచ్చింది. దీన్ని బట్టి బ్రియాన్ లారాకు ఇంగ్లండ్ జట్టు, దేశం ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవచ్చు.