క్లే కోర్టు కింగ్ రఫెల్ నాదల్ తన ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ వేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 6-3, 6-3, 6-0 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఇది రఫెల్ నాదల్‌కు 14వ ఫ్రెంచ్ ఓపెన్ కావడం విశేషం. ఓపెన్ శకంలో ఒకే ఆటగాడు ఒకే గ్రాండ్ స్లామ్‌ని ఇన్ని సార్లు గెలవడం ఇదే ప్రథమం.


మ్యాచ్‌లో నాదల్ ధాటికి ఎక్కడా ఎదురు లేకుండా పోయింది. మొదటి రెండు సెట్లను సులభంగా 6-3, 6-3తో గెలుచుకున్న నాదల్ చివరిసెట్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. రూడ్‌కు ఒక్క పాయింట్ కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఏకంగా 6-0తో ఈ సెట్‌ను నాదల్ గెలుచుకున్నాడు. కేవలం రెండున్నర గంటల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. మొదటి గ్రాండ్ స్లామ్ గెలవాలనుకున్న రూడ్ కల అలానే మిగిలిపోయింది.


మొత్తంగా చూసుకుంటే ఇది నాదల్‌కు 22వ గ్రాండ్ స్లామ్. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచింది కూడా రఫెల్ నాదలే. నాదల్ తర్వాతి స్థానాల్లో రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిక్ ఉన్నారు. వీరిద్దరూ చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచారు.