Sunil Gavaskar - Virat Kohli: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) అండగా నిలిచారు. అతడికి తాను సాయం చేయగలనని పేర్కొన్నారు. కనీసం 20 నిమిషాలు మాట్లాడితే కొన్ని సలహాలు ఇస్తానని వెల్లడించారు.
'విరాట్ కోహ్లీ 20 నిమిషాలు నన్ను కలిస్తే కొన్ని విషయాలు చెబుతాను. అవి అతడికి సాయపడొచ్చు. గ్యారంటీ ఇవ్వలేను గానీ చాలావరకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ లైన్‌కు సంబంధించి చర్చించాలి. కొన్నేళ్ల పాటు ఓపెనర్‌గా ఇదే ఆఫ్‌స్టంప్ లైన్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దీన్నుంచి బయటపడేందుకు కొత్తగా ప్రయత్నించాలి. అందుకే అతడు నన్ను కలిస్తే ఇవన్నీ చెబుతాను' అని గావస్కర్ అన్నారు.
పరుగులు చేయాలన్న తాపత్రయంతో ప్రతి బంతినీ ఆడాలని బ్యాటర్లు భావిస్తారని సన్నీ తెలిపారు. చాన్నాళ్లు పరుగులు చేయకపోవడంతో విరాట్ సైతం ఇలాగే ఆలోచిస్తున్నాడని అంచనా వేశారు. ఇంగ్లాండ్ సిరీసులో అతడు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడని వివరించారు. ఎప్పట్లాగే ఒకే విధంగా ఔటయ్యాడని పేర్కొన్నారు.
'విరాట్ విషయంలో తొలి పొరపాటే చివరిది అవుతోంది. ఎందుకంటే అతడు ఎక్కువగా రన్స్ చేయడం లేదు. ఎక్కువ స్కోరు చేయాలన్న తాపత్రయంలో ఆడకూడని బంతుల్నీ ఆడేస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం అతడు మంచి బంతులకే ఔటయ్యాడు. కోహ్లీ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో వేచి చూడాలి. అతడికి పొరపాట్లు చేసే హక్కుంది. 70 సెంచరీలు కొట్టిన అనుభవం అతడిది. అన్ని పరిస్థితుల్లో రాణించాడు' అని సన్నీ తెలిపారు.
'విరాట్ విషయంలో తొందరపడొద్దు. కొన్నాళ్లు ఓపికగా ఉండాలి. ఒక ఆటగాడు 32, 33 పరుగులకే ఔటవుతుంటూ భారత్‌లో అతడిపై త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. బాగా ఆడాలని పోరాడుతున్న సమయంలో జట్టు నుంచి బయటకు పంపిస్తుంటారు. అందుకే కోహ్లీ ఫామ్‌పై సహనంతో ఉండాలి. దేశానికి సేవ చేస్తున్న దిగ్గజాల వైఫల్యాలకు అనుమతి ఉంటుంది' అని సన్నీ పేర్కొన్నారు.
ఛేదనలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు హడలెత్తిపోయేవాళ్లు. అతడిని ఎలా ఔట్ చేయాలో అని సతమతం అయ్యేవాళ్లు. అతడికి బంతులేసేందుకు భయపడేవాళ్లు. అలాంటిది రెండున్నరేళ్లుగా విరాట్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేస్తున్నా, మిగతా క్రికెటర్లతో పోలిస్తే సగటు బాగున్నా. తన మునుపటి స్థాయి అందుకోవడం లేదు.