Shane Warne Demise: ఓ ముప్పై ఏళ్ల పాటు తనను మునివేళ్లపై ఆడించిన ఓ దిగ్గజం... వదిలేసి వెళ్లిపోయాడని.. క్రికెట్ ప్రపంచం కన్నీళ్లు పెడుతోంది. షేన్ అంటే "షేర్" అంటూ... అభిమానులు సంబర పడొచ్చు. డెడికేషన్ ఉన్నా డిసిప్లిన్ లేదంటూ.... జెంటిల్‌మెన్ క్రికెటర్లు.. క్లాసులు తీసుకోవచ్చు. వెయ్యి వికెట్లు తీసిన యోధుడని.. బాల్ ఆఫ్ ది సెంచరీ వేసిన మొనగాడని.. అభిమానులు సంబరపడొచ్చు. కానీ అంతేనా..? కాదు... "అంతకుమించి" చాలా ఉంది.. షేర్ లైఫ్‌లో.. సరిగ్గా చూస్తే.. షేన్ వార్న్ ఓ లైఫ్ లెస్సన్...!
తన తరంలోనే కాదు.. మొత్తం క్రికెట్ హిస్టరీలోనే షేన్ వార్న్ లెజండరీ స్పిన్నర్. తన కన్నా ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తి ఉండొచ్చు గాక.. కానీ పాపులారిటీ.. టెక్నిక్.. టాలెంట్ విషయంలో షేన్‌కు సాటి వచ్చేవారు లేరు. షేన్ వార్న్ తో పాటే.. కెరీర్‌ను ప్రారంభించారు... మురళీ, అనిల్ కుంబ్లే , సక్లెయిన్...! షేన్ వార్న్ కు కాంటెంపరీలు వీళ్లు... టాలెంట్ విషయంలోనూ సరితూగే వాళ్లే.. ఇక పాత తరం ప్లేయర్లు , అబ్దుల్ ఖాదిర్, బేడీ, ప్రసన్న వంటి వాళ్లు, ఎక్కువ వికెట్లు తీసిన హర్భజన్, రవిచంద్రన్ వంటి వాళ్లు కానీ, ఎవరిని చూసినా.. వారికి షేన్‌కు ఉన్న ప్రధాన తేడా అతని ప్రాంతం.. బంతి విపరీతంగా బౌన్స్ అవుతూ దూసుకెళ్లే పచ్చిక మైదానాల నుంచి వచ్చాడు అతను....
ఆస్ట్రేలియా అంటేనే ప్రపంచాన్ని గడగడలాడించే పేస్‌కు ఫేస్ లాంటిది.. వార్న్ కంటే ముందున్న డెన్నిస్ లిల్లీ... అతనితో పాటు ఉన్న మెక్ డెర్మాట్, మెక్ గ్రాత్, జాసన్ గెలెస్పీ, బ్రెట్‌లీ లాంటి స్టాల్‌వర్ట్స్ ఉన్నారు. ఆడిన మ్యాచ్‌లన్నీ... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్. ఇవన్నీ బౌన్సీ, పేస్ పిచ్‌లే. అతని సమకాలికులకు ఉన్నంత వెసులుబాటు వార్న్‌కు లేదు. అసలు గ్రీన్ పిచ్‌లపై బంతిని గిర గిరా తిప్పడం అన్నది.... చాలా కష్టమైన విషయం.. అది చేస్తూనే ఆ పేస్ టీమ్ నుంచి స్పేస్ తీసుకోవాలి. పేస్‌తో గడగడలాడించే.. మెక్ గ్రాత్, బ్రెట్ లీ వంటి వాళ్ల దగ్గర నుంచి బౌన్సీ పిచ్ ల మీద బాల్ తీసుకోవడం అంత తేలిక కాదు కదా.. షేన్ సహచర బౌలర్లలో మెక్‌గ్రాత్ 500కు పైగా వికెట్లు తీస్తే... మిగతా వారు మూడొందల వికెట్లు సాధించారు. వాళ్ల డామినేషన్ ఏ స్థాయిలో ఉంటుందంటే.... తాను స్వయంగా వైస్ కెప్టెన్ గా ఉన్నా సరే.. బాల్ అందుకోవడానికి సందేహించేంత... ఈ విషయాన్ని వార్నే చెప్పాడు.. ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేస్తూ.. తనను తాను నిలదొక్కుకోవడం.. నిరూపించుకోవడం.. లెజండరీ ఎగ్జాంపుల్‌గా నిలవడం.. అన్నది కచ్చితంగా మిగతా వాళ్ల కంటే అతన్ని అందనంత ఎత్తులో నిలబెట్టాయి.
షేన్ వార్న్‌తో గొడవే కానీ... అతని స్పిన్ తో ఎవరికీ పేచీ లేదు. పర్సనల్ లైఫ్ అంత క్లీన్ గా లేకపోయినా మురళీధరనా.. షేన్ వార్నా అన్న పోటీలో మాత్రం షేన్ వార్నే మిస్టర్ క్లీన్‌గా కనిపిస్తాడు. Flawless Spin అతనిది. షేన్ వార్న్‌ను పొగిడేస్తూ.. మిగతా వాళ్ల ప్రతిభను తక్కువ చేసే ప్రయత్నం కాదిది. సక్లెయిన్ స్పిన్నర్...కానీ కెరీర్ ఎక్కువ కాలం లేదు. కుంబ్లే డిసిప్లిన్ వల్ల నిలబడగలిగాడు. మురళీధరన్ చూస్తే... అతని టీమ్‌లో పేస్ నుంచి కాంపిటీషనే లేదు. ఎందుకంటే.. మురళీటైమ్‌లో శ్రీలంకకు చమిందా వాస్ తప్ప ఫాస్ట్ బౌలర్లే లేరు. భుజాలు అరిగిపోయే వరకూ అతనే బౌలింగ్ వేసేవాడు. అన్నింటికీ మించి... వీళ్లు ఎక్కువగా ఆడింది...ఉపఖండపు పిచ్‌ల మీద.. ! మురళీధరన్, అనిల్ కుంబ్లే, వార్న్ ముగ్గురూ కూడా సరిసమానంగా దాదాపు 40వేల బంతులు టెస్ట్‌మ్యాచ్‌లలో విసిరారు. మిగతా ఇద్దరికీ... అనివార్యంగా బౌలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. వాళ్లే చాయిస్. కానీ.. వార్న్ తనకు ఇచ్చే "పరిస్థితి" కల్పించుకున్నాడు.
బహుశా అంత ఫ్రిక్షన్ ఉండటం వల్లే కావొచ్చు.. లైఫ్ లో ఏం జరిగినా అతనికి పెద్దగా రిగ్రెట్స్ ఉండవ్.. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయినా... నిర్లక్ష్యంగా కార్లు నడిపినా.. స్టీవ్ వా, పాంటింగ్‌లతో గొడవలకు దిగినా... అవన్నీ "జరుగుతాయ్... " అనే అంటాడు.. కెరీర్ ముగిశాక కూడా కాంట్రవర్సీలు ఆగలేదు. కిందటేడాది... ఇండియా- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ జరుగుతుంటే.. లబుషేన్ గురించి.. పాసింగ్ కామెంట్లు చేశాడు.. అడిగితే.. మైక్ ఎయిర్ లో ఉందని తెలీలేదు.. అన్నాడు కానీ.. చేసింది తప్పు అనలేదు. అంత రాక్ సాలిడ్ పర్సనాలిటీ తను.
ఆస్టేలియన్ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతికి నివాళిగా .. తన చివరి ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఈ లెజెండ్ కూడా వెళ్లిపోవడం యాదృచ్ఛికమేమో...
కెరీర్‌లో తలపడి.. కలబడి.. నిలబడి నెగ్గడం అన్నది.. ఓ లైఫ్ లెస్సన్. అదే షేన్ వార్న్ లైఫ్‌లో చూడాల్సింది.