Shanakas 25 ball 54 scripts victory for Sri Lanka: టీ20 క్రికెట్ అంటేనే గమ్మత్తైన ఆట! ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు! గెలుపోటములు క్షణాల్లో మారుతుంటాయి. ఆస్ట్రేలియా-శ్రీలంక తలపడ్డ మూడో టీ20లో ఇదే జరిగింది. అప్పటి వరకు గెలుపు అంచనాల్లేని లంకేయులు ఆఖరి 18 బంతుల్లో మ్యాచ్ గతిని మార్చేశారు. మూడు ఓవర్లలో 59 పరుగుల్ని ఛేజ్ చేసి కంగారూలనే కంగారు పెట్టించారు. యువ క్రికెటర్ దసున్ శనక (54*; 25 బంతుల్లో 5x4, 4x6) డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో లంక 1-2తో సిరీస్‌ను కాస్త గౌరవప్రదంగా ముగించింది.
మొదట ఆసీస్
పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (39), ఆరోన్ ఫించ్ (29) రాణించడంతో తొలి వికెట్‌కు 43 పరుగులు వచ్చాయి. మిడిలార్డర్‌లో స్టీవ్‌స్మిత్ (37 నాటౌట్), మార్కస్ స్టాయినిస్ (38; 23 బంతుల్లో) చితక్కొట్టడంతో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కంగారూల వద్ద బలమైన బౌలింగ్ లైనప్ ఉండటంతో ఈ టార్గెట్‌ను ఛేదించడం సింహళీయులకు కష్టమేనని అంతా భావించారు.
వరుసగా వికెట్లు
అందుకు తగ్గట్టే ఛేదనలో 25 పరుగుల వద్దే ఓపెనర్ గుణతిలక (15) వికెట్‌ను లంక చేజార్చుకుంది. కాసేపు పాథుమ్ నిసాంక (27), చరిత్ అసలంక (26) ధాటిగా ఆడటంతో పరుగులొచ్చాయి. అయితే జట్టు స్కోరు 67 వద్ద అసలంకను స్టాయినిస్ ఔట్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది. 15.4 ఓవర్లకు 108 పరుగులకు 6 వికెట్లు నష్టపోయింది. 17వ ఓవర్లో ఆగర్ 6 పరుగులే ఇవ్వడంతో సమీకరణం 18 బంతుల్లో 59గా మారింది.
శనక విశ్వరూపం
ఈ పరిస్థితుల్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా దసున్ శనక చెలరేగాడు. 18వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు, 2 బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో శనక 6, 4 కొడితే కరుణ రత్నె 4 బాదేశాడు. ఆఖరి ఓవర్లో 19 పరుగులు కావాలి. ఒత్తిడిలో రిచర్డ్‌సన్ వరుసగా వైడ్లు వేయడంతో లంక లక్ష్యం 4 బంతుల్లో 15గా మారింది. అప్పుడు శనక వరుసగా 4, 4, 6 కొట్టాడు. ఆ తర్వాత వైడ్ పడటంతో మరో బంతి మిగిలుండగానే లంక గెలిచేసింది. శనక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.