Tirupati Traffic Police beats An Old Man: తిరుపతి: తిరుపతిలో ట్రాఫిక్ పోలీస్ కిషోర్ నాయుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ఒక వృద్ధుడిపై తనదైనశైలిలో ప్రతాపం చూపించాడు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాడన్న కారణంతోనే, మరేదైనా కారణంతోనే తనకు ఇష్టం వచ్చినట్లు పదే పదే విచక్షణా రహితంగా కాళ్లతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. శనివారం సాయంత్రం తిరుపతి అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య సర్కిల్‌కు సిమెంట్ లోడ్ తో ఓలారీ వచ్చింది. లారీ అక్కడ నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, లారీని వెంటనే అక్కడ నుంచి పక్కకు తీయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పాడు. ఏం ఇబ్బంది లేదని లారీలో వచ్చిన ఓ వ్యక్తి పోలీసుతో అన్నాడు. ఒకరినొకరు మాట మాట అనుకుంటూ పరస్పరం తోసేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కాలితో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. వయసులో పెద్దవాడు అని కూడా చూడకుండా తన కాలికి పని చెప్పడాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు షాకయ్యారు.
ట్రాఫిక్ పోలీస్ వృద్ధునిపై వీరంగం చేసిన వీడియో వైరల్..
ట్రాఫిక్ పోలీస్ ప్రవర్తించిన తీరును ప్రక్కనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఒకవేళ ఆ వ్యక్తి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే అవసరమైతే అందుకు తగ్గట్టు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరీ అవసరమైతే సమీపంలోని బ్లూ కోర్ట్స్ సిబ్బందిని పిలిచి తాత్కాలికంగా అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతే తప్పా ప్రజలపైన నేరుగా అందరూ చూస్తుండగా భౌతికదాడికి దిగడం, అది కూడా అందరూ చూస్తున్నారన్న విచక్షణ మరచి బహిరంగ ప్రదేశంలో వ్యవహరించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్..
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉన్నతాధికారులు ఉపన్యాసాలు ఒకవైపు ఇస్తుంటే మరోవైపు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. వృద్ధుడిని పదే పదే తన్నుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం చేసిన ఈ ఘటనపై తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ స్పందించారు. క్షమశిక్షణ ఉల్లంఘించిన కిషోర్ పై శాఖా పరమైన చర్యలకు సిద్దమన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిషోర్ ను సస్పెండ్ చేసేందుకు పోలీసు శాఖ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ సార్ ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ స్థానికులు, నెటిజన్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ చర్యపై మండిపడుతున్నారు. అతడ్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Shocking News: నేరేడుపండ్లు తిని బాలుడు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం - అసలేం జరిగింది !
Also Read: Pathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య!