Devotees Rush in Tirumala: వేసవి సెలవులతో పాటు వారాంతాలు కావడంతో తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ నేడు కాస్త తగ్గింది. శుక్రవారం, శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 40 గంటల సమయం పట్టింది. ఆదివారం నాడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు దాదాపు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో వికేండ్ లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా భక్తుల కోసం వారపు ఆర్జిత సేవలను సైతం రద్దు చేయాలని ఈవో ధర్మారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు
తిరుమలలో శనివారం నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనార్థం భక్తులు రాంభగీచా అతిథి గృహాలు వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం టీబీ కౌంటర్ వరకు భక్తులు స్వామివారి దర్శనార్థం ఎదురుచూస్తున్నారు.. తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి ఆదివారం దాదాపు 12 గంటల వరకు సమయం పడుతోంది. కాగా, నిన్న శ్రీవారిని రికార్డు స్థాయిలో 87,698 మంది భక్తులు దర్శించుకున్నారు. 48,804 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకలు, విరాళాల రూపంలో నిన్ని ఒక్కరోజు శ్రీవారి హుండీకి రూ.3.88 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
బ్రేక్ దర్శనాలు రద్దు
ఒక్కసారిగా తిరుమలలో భక్తులు రద్దీ అన్యూహంగా పెరిగింది. దీంతో క్యూలైన్స్ లో గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలైన్స్ ను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సెక్టార్ కి ప్రత్యేకంగా అధికారిని నియమించారు. ప్రస్తుతం క్యూలైనులో చేరుకుంటున్న భక్తులకు దర్శనానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కావున భక్తులు ఒపికతో వేచి ఉండి స్వామి వారి దర్శించుకోవాలని ఈవో కోరుతున్నారు. క్యూ లైనులో ఉన్న భక్తులకు నిరంతరాయంగా ఆహార సౌకర్యం కల్పిస్తున్నారు. రేపు రాత్రికి గానీ, ఎల్లుండి ఉదయానికి భక్తుల తాకిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్ లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా భక్తుల కోసం వారపు ఆర్జిత సేవలను సైతం రద్దు చేయాలని ఈవో ధర్మారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.