1983 జూన్ 25....  భారత క్రీడాభిమానులెవ్వరూ మర్చిపోలేని రోజు. నిజమే మర్చిపోవాలన్నా కుదరని సందర్భం అది. భారత క్రికెట్‌ను జగజ్జేతగా నిలిపిన రోజు అది. కపిల్ డెవిల్స్ అద్భుత పోరాట పటిమతో ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న భావోద్వేగక్షణాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయి. అప్పుడప్పుడే దేశంలో రంగురంగుల టీవీ అడుగుపెట్టిన తరుణంలో జరిగిన క్రికెట్ సంగ్రామాన్ని ప్రత్యక్షంగా తిలకించిన కోట్లాది మంది భారతీయులు మైమరిచిన మధుర క్షణాలు ఇప్పటికీ మదిలో తాజాగా ఉన్నాయి. మొహిందర్ అమర్‌నాథ్ ఆఖరి వికెట్‌ను నేలకూల్చగానే వేలాదిమంది ప్రేక్షకులు మైదానాన్ని ముంచెత్తిన దృశ్యం, భారత మువ్వన్నెల జెండా లార్డ్స్ మైదానంలో సగర్వంగా రెపరెపలాడుతుంటే, ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లో చూసిన ఇండియన్స్ గర్వంతో ఉప్పొంగిపోయారు. తన్మయత్వంలో తేలిపోయారు. అప్పటికే వరసగా రెండు ప్రపంచ కప్ లను సొంతం చేసుకొని హ్యాట్రిక్‌పై కన్నేసిన బలమైన వెస్టిండీస్ జట్టును 140 పరుగులకే కుప్పకూల్చడం క్రికెట్ పండితులనే ఖంగుతినిపించింది. యావత్ ప్రపంచాన్ని అబ్బురపరచింది.


కపిల్‌దేవ్ నాయకత్వంలోని భారత జట్టు 1983 వరల్డ్ కప్ టోర్నమెంట్లో సంచలనాల మోత మోగించడం ఒకరకంగా మన దేశ క్రికెట్  గతినే మార్చివేసింది. టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారాన్ని నేనూ వీక్షించడం ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 183 పరుగులకే కుప్పకూలడంతో, అభిమానులంతా ఒక్కసారిగా తీవ్రనిరాశకు లోనైన మాట వాస్తవం. వెస్టిండీస్ జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ ఒక్కడు చాలు, ఒంటిచేత్తో టార్గెట్ బాది పారేస్తాడని అందరూ జోస్యం చెప్పారు. కానీ ఎక్కడో లోపల ఆశ... మనం గెలవాలన్న ఆకాంక్ష. కోట్లాది మంది తమ ఇష్టదైవాలకు మొక్కుతూ, టీవీలు, రేడియోల ముందు వాలిపోయారు. ఒక్కో బంతికీ పెరుగుతున్న ఉత్కంఠ. ప్రత్యర్థి వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది మొదలు మన బౌలర్ల ప్రతాపం చూసి అంతా నివ్వెరపోయారు. బల్విందర్ సందూ బోణీ కొట్టినా, మాస్టర్ రిచర్డ్స్ రంగప్రవేశంతో పరుగుల వరద పారింది. అంచనా వేసిట్టుగానే రిచర్డ్స్ సహజశైలితో బౌండరీల వర్షం కురిపించడంతో పాతిక ఓవర్లలోనే మ్యాచ్ ముగుస్తుందన్న భావన నెలకొంది. అయితే కెప్టెన్ కపిల్‌దేవ్ మైదానంలో పరిగెత్తుతూ ఒడిసిపట్టుకున్న క్యాచ్ కాస్తా మ్యాచ్‌ను మలుపుతిప్పింది. అప్పటివరకు ప్రమాదకరంగా కనిపించిన రిచర్డ్స్ వెనుదిరిగాడు. 


నిజానికి కపిల్ పట్టుకున్నది క్యాచ్ కాదు వరల్డ్ కప్ అని అందరూ ఆ తర్వాత విశ్లేషించారు. కెప్టెన్ లాయిడ్ కూడా పెవిలియన్ ముఖం పట్టడంతో మ్యాచ్‌లో టీమిండియా పైచేయి అయింది. ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ ఆఖరి మూడు వికెట్లు తీసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. వాస్తవానికి జింబాబ్వేతో లీగ్ దశలో కపిల్ దేవ్ అరవీరభయంకరమైన బ్యాటింగ్ వల్లే భారత్‌కు నాకౌట్లో స్థానం గెలిపించింది. 17 పరుగులకే 5 వికెట్లు నష్టపోయిన తరుణంలో బ్యాటింగ్‌కు దిగి ఒంటిచేత్తో 175 పరుగులు కొట్టడం మామూలు విషయం కాదు. దురదృష్టవశాత్తు ఆరోజు బీబీసీ సిబ్బంది మెరుపు సమ్మెకు దిగడంతో కపిల్ దేవ్ హిస్టారిక్ ఇన్నింగ్స్‌  వీడియో కవరేజీ లేకుండా పోయింది. కాబట్టే ట్రోఫీ గెలవడంలో కపిల్ పాత్ర స్పూర్తిదాయకమే కాదు వీరోచితం కూడా అయ్యింది. 


క్రీడలు, ముఖ్యంగా క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే వాళ్లలో నేనూ ఒకన్ని. ప్రపంచ కప్ టైటిల్ సమరాన్ని, అదీ... రంగుల టీవీలో వీక్షించడం నా జీవితంలో మర్చిపోలేని మధురక్షణం. అపుడు నేను పదో తరగతి విద్యార్థిని. మా ఇంటిముందు ఓ ఈసీఐఎల్ అధికారి ఇంట్లో కలర్ టీవీ ఉండేది. విషయంలోకి వెళ్తే... మా స్నేహితులతో కలసి మేం రోజూ మా ఇంటిముందున్న ఖాళీ మైదానంలో క్రికెట్ ఆడుకునేవాళ్లం. ఆ ఇంటి అంకుల్ మా ఆటను, మా అల్లరిని అపుడపుడూ చూస్తుండేవారు. అందుకే నాకు వాళ్లింట్లో 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు సువర్ణావకాశం లభించింది అని చెప్పాలి. అయితే భారత్ బ్యాటింగ్ మాత్రమే చూశాను. ఇంట్లో ఎదురుచూస్తారు. ఎలాగూ ఇండియా గెలవదు, లో స్కోర్ కదా...ఇంటికెళ్లు బాబూ అన్నారు. ఇక ఇండియాలో మనకు అప్పటికే చీకటి కావడంతో, నిరాశతోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయితేనేం నేను ఫుల్లుగా హ్యాపీ. నా తోటి పిల్లలకు దక్కని సదవకాశం నాకు దక్కిందన్న ఫీలింగ్‌తో ఉక్కిరిబిక్కిరయ్యాను. లక్కీగా ఇంట్లో రేడియో ఉండటం, బీబీసీలో రన్నింగ్ కామెంటరీ వినడానికి మా నాన్నగారు అనుమతినివ్వడంతో నా సంతోషానికి అవధుల్లేవు. భోజనం చేస్తూ కామెంటరీ విన్నాను. 


విండీస్ జట్టు కేవలం అయిదు పరుగుల వద్దే మొదటి వికెట్ పడటంతో ఎగిరి గంతేశాను. బయట అందరికి వినపడేలా బిగ్గరగా అరిచేశాను. అలా ఒక్కో వికెట్ పడుతూ ఉంటే, ఆనందం అంతకంతకూ రెట్టింపయ్యింది. ఎగిరి గంతులేశాను. హోల్డింగ్ వికెట్ రూపంలో వెస్టిండీస్ జట్టు ఆలౌటవ్వడంతో ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యాను. మళ్లీ నాన్నను వాటేసుకున్నాను. ఏడ్చినంత పనిచేశాను. బయటకు వచ్చి చూస్తే, మా ఇంటిముందే కలర్ టీవీ అంకుల్ ఇంట్లో లైటు వెలుగుతూ ఉంది. ధైర్యం చేసి, మెల్లగా వాళ్లింటి వైపు నడిచాను. నన్ను చూస్తూనే అంకుల్ ఇండియా గెలిచిందోయ్... రా చూడు అన్నారు. టీవీలో చూస్తే ఏముంది... రెండు కళ్లూ సరిపోలేదు. లార్డ్స్ మైదానంలో భారత అభిమానుల కోలాహలం. వేలాది మంది కేరింతలు...డ్యాన్సులు. భల్లే భల్లే చూస్తుంటే... నా కాళ్లు కూడా భూమిపైన నిలబడటం కష్టంగా కనిపించింది. 


కపిల్‌దేవ్ ట్రోఫీని గాల్లోకి ఎత్తినపుడు వెంట్రుకలు నిక్కబొడిచాయి. గూస్‌బంప్స్‌.... తర్వాత అంకుల్‌కు థ్యాంక్స్‌ చెప్పి ఇంటికెళ్లాను గాని.... ఒక్క పట్టాన నిద్ర పట్టలేదు. కపిల్‌దేవ్‌ క్యాచ్... అమర్నాథ్ ఆఖరి వికెట్... వేలాది మంది ఫ్యాన్స్‌ జాతీయ జెండాతో మైదానంలోకి పరుగులెత్తడం పదేపదే గుర్తుచేసుకుంటూ..... మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు ఉదయం అన్ని పత్రికల్లో మొదటి పేజీ బ్యానర్ చూస్తూ.... మరింత పరవశానికి లోనయ్యాను. నాకు ఇష్టమైన క్రీడా వారపత్రిక  స్పోర్ట్స్‌ స్టార్ వీక్లీ సంచిక మార్కెట్లోకి రాగానే.... ఒక్కటి కాదు మూడు పుస్తకాలు కొని ఇంట్లో భద్రపర్చుకున్నాను. అందులో చిత్రమాలిక, కథనాలు మళ్లీ మళ్లీ చదివి టెలివిజన్‌లో చూసిన అనుభూతులను పోల్చుకున్నాను. టీమిండియా యావత్తు సమస్టిగా ఆడి సాధించిన చరస్మరణీయమైన విజయం అది. జట్టులోని అందరూ తమవంతు పాత్రను గొప్పగా పోషించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టోర్నీలో యశ్‌పాల్ శర్మ, శ్రీకాంత్, సందీప్ పాటిల్ బ్యాటింగ్ మెరుపులు... జింబాబ్వేపై కెప్టెన్ కపిల్ సుడిగాలి ఇన్నింగ్స్, రోజర్‌బిన్నీ, మదన్‌లాల్ బౌలింగ్, మొహిందర్ అమర్నాథ్ ఆల్‌రౌండ్ నైపుణ్యం... ఇలా అన్నీ జట్టు విజయానికి దోహదం చేశాయి. భారత సారథి, వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ ఆ తర్వాత పలుమార్లు హైదరాబాద్ వచ్చినపుడు, క్రీడా విలేకరిగా కలుసుకున్న సందర్భం కూడా ఎంతో గొప్ప ఫీలింగ్‌ ఇచ్చాయి. 


2011లో మళ్లీ భారత్ రెండోసారి ప్రపంచ కప్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన సందర్భంలో నేను జీ టీవీలో స్పోర్ట్స్‌ ఎడిటర్‌ హోదాలో ఉన్నాను. అపుడే ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌లోనూ కమిటీలో ఉండటంతో, సెమీఫైనల్స్, ఫైనల్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ తిలకించాము. మా సహచరులతో కలిసి క్లబ్బులో ఏర్పాటుచేసిన పెద్ద స్క్రీన్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ... భలే ఎంజాయ్ చేశాము. అపుడు కపిల్‌దేవ్... ఇపుడు మహిందర్ సింగ్ ధోనీ. ఇద్దరూ గొప్ప నాయకులే. ఇద్దరూ టీమిండియాకు క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీని అందించిన హీరోలు. ఫైనల్లో వారిద్దరూ అద్భుతంగా ఆడి జట్టుకు ట్రోఫీని అందించిన చిరస్మరణీయులు. 1983 ఫైనల్లో కపిల్ క్యాచ్.... 2011 ఫైనల్లో ధోనీ సూపర్ బ్యాటింగ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాయి. మొత్తంమీద ఈ రెండు మహోజ్వల ఘట్టాలు నన్నెంతగానో పులకింపజేశాయి. చివరగా నేను ఏకంగా 2004లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన గ్రీసు రాజధాని ఏథెన్స్ నగరానికి వెళ్లినపుడు సేమ్ ఫీలింగ్. ఒలింపిక్ క్రీడల్లో మనవాళ్లు పతకాలు సాధించినా... పోరాటపటిమ ప్రదర్శించినా నాలో దాగివున్న ఓ స్పోర్ట్స్‌ లవర్, ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు ఆనందడోలికల్లో మునిగితేలుతుంటాడు. స్పోర్ట్స్‌ మన్ స్పిరిట్‌ అంటే అదేనేమో... జీవితకాలం అదే స్ఫూర్తితో పయనిస్తుంటా.


బి.రాజమౌళి చారి, 
సీనియర్ పాత్రికేయులు,
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి