Rohit Sharma News: తన బ్యాటింగ్‌ సామర్థ్యం వల్లే రోహిత్‌ శర్మ  (Rohit Sharma) జట్టులో ఉన్నాడని టీమ్‌ఇండియా (Team India) మాజీ క్రికెటర్‌ సాబా కరీమ్‌ (Saba Karim) అంటున్నాడు. కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యతేనని గుర్తు చేశాడు. నాయకత్వ ఒత్తిడితో బ్యాటింగ్‌పై దృష్టి కోల్పోవద్దని సూచించాడు.


ఈ మధ్యే ముగిసిన శ్రీలంక సిరీసులో టీమ్‌ఇండియా (IND vs SL) అదరగొట్టింది. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. కెప్టెన్‌గా అదరగొట్టిన రోహిత్‌ శర్మ మూడు మ్యాచుల్లో కలిసి చేసింది 50 పరుగులే. సగటు 16.67. హిట్‌మ్యాన్‌ ప్రధాన బలం బ్యాటింగేనని, అందువల్లే అతడు జట్టులో ఉన్నాడని మాజీ క్రికెటర్‌ సాబా కరీమ్‌ అంటున్నాడు. గతంలో కెప్టెన్సీ అదనపు బాధ్యతలతో కొందరు తమ ప్రధాన విభాగంపై పట్టు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నాడు.


'రోహిత్‌ శర్మ తన బ్యాటింగ్‌ వల్లే జట్టులో ఉన్నాడు. కెప్టెన్సీ అనేది అదనపు బాధ్యత మాత్రమే. బ్యాటింగ్‌పై అతడు ఫోకస్‌ పోగొట్టుకోవద్దు. చాలాసార్లు కెప్టెన్లు తమ ప్రధాన విభాగంలో రాణించకపోవడాన్ని మనం చూశాం. ఇలాంటివి మరోసారి జరగొద్దు' అని సాబా కరీమ్‌ అన్నాడు. ఇండియా కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ ఇప్పుడే కెరీర్‌ మొదలు పెట్టాడని ఆయన పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో రోహిత్‌ బ్యాటింగ్‌ టీమ్‌ఇండియాకు ఎంతో అవసరమని స్పష్టం చేశాడు. అతడు తన బ్యాటింగ్‌ను మరింత మెరుగు పర్చుకోవాలని అంటున్నాడు.


'రోహిత్ శర్మకు ఇది ఆరంభం మాత్రమే. జట్టుకు తన పరుగులు ఎంత అవసరమో మున్ముందు అర్థం చేసుకుంటాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన అత్యంత కీలకం. ఎందుకంటే అక్కడ మైదానాలు పెద్దగా ఉంటాయి. బలమైన ప్రత్యర్థులు, టాప్‌ క్వాలిటీ బౌలర్లు ఉంటారు. అందుకే తన బ్యాటింగ్‌ను మరింత ఇప్రూవ్‌ చేసుకోవాలి' అని సాబా కరీమ్‌ అన్నాడు.


Also Read: వస్తే చంపేస్తాం - ఆస్ట్రేలియా స్పిన్నర్ భార్యకు చావు బెదిరింపు - పాకిస్తానీయుల పనేనా?


Also Read: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్