Aus vs Pak: ఆస్ట్రేలియా (Australia), పాకిస్తాన్ (Pakistan) సిరీస్ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. 24 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతూ ఉండటం విశేషం.


పాకిస్తాన్‌లో భద్రతకు సంబంధించిన సమస్యలు ఉండటంతో... పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ఆస్ట్రేలియాకు అత్యుత్తమ స్థాయి భద్రతను అందించింది. అయితే ఈ దశలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ పాకిస్తాన్‌కు వస్తే చంపేస్తామని ఆయన భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరింపులు వచ్చాయి.


సిడ్నీ హెరాల్డ్, ది ఏజ్ కథనాల ప్రకారం... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఆస్టన్ అగర్ భార్యకు చావు బెదిరింపులు వచ్చింది నిజమే అన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులకు ఈ అంశంపై ఫిర్యాదు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.


అయితే బెదిరింపులు వచ్చింది ఫేక్ ఇన్‌స్టాగ్రాం ఖాతా నుంచి అని భద్రతా సిబ్బంది చేసిన దర్యాప్తులో తేలింది. దీని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదని భద్రతా సిబ్బంది తెలిపారు. ఆస్ట్రేలియా ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ పాకిస్తాన్ సురక్షితంగానే ఉందని, ఇది ఒక ఆసక్తికరమైన పర్యటన అని పేర్కొన్నారు.


ఐపీఎల్‌కు లేటేనా...


పాకిస్తాన్, ఆస్ట్రేలియాల మధ్య ఈ సిరీస్ ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనుంది. దీంతో ఐపీఎల్ (Indian Premier League) ప్రారంభ మ్యాచ్‌లకు కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిస్సయ్యే అవకాశం ఉంది.