టీమ్‌ఇండియాకు కొత్త కోచ్‌ రానున్నాడా? రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌ పదవి చేపట్టక తప్పదా?  కోచ్‌గా పదవీకాలం పొడగిస్తానంటే రవిశాస్త్రి నిరాకరించాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత రవిశాస్త్రి కోచ్‌ పదవి నుంచి దిగిపోతాడని సమాచారం. ఇందుకు అతడు సిద్ధమయ్యాని తెలుస్తోంది.  బీసీసీఐకి అతడింకా అధికారికంగా విషయం చెప్పలేదని అంటున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత అతడితో ఒప్పందం ముగుస్తుంది.


Also Read: Deepak Chahar: అతడు వన్‌డౌన్‌కు ప్రమోట్‌ చేయడంతో అర్ధశతకం బాదేశాను.. ధోనీది సాయం చేసే గుణం


డిసెంబర్లో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఆ ఒక్క నెల వరకైనా పదవీకాలాన్ని పొడగించాలని బీసీసీఐ భావించినా అందుకు శాస్త్రి అంగీకరించలేదని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తాత్కాలిక కోచ్‌గా ఎన్‌సీఏ చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌నే మళ్లీ సంప్రదించారని తెలిసింది.


గ్యారీ కిర్‌స్టన్‌ తర్వాత భారత్‌కు దొరికిన అత్యుత్తమ కోచ్‌ రవిశాస్త్రి అనే చెప్పాలి. మొదట అతడు టీమ్‌ఇండియాకు డైరెక్టర్‌గా పనిచేశాడు. 2017లో ప్రధాన కోచ్‌గా పదవి చేపట్టాడు. మళ్లీ 2019లో అతడిని తిరిగి కోచ్‌గా ఎంపిక చేశారు. అతడి నేతృత్వంలో భారత్‌ అద్భుత విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు సిరీసులు కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌లో జైత్రయాత్ర సాగించింది. ఇంగ్లాండ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. ఇప్పటికైతే  ఆంగ్లేయుల అడ్డాలో సిరీస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకున్నట్టే!


Also Read: CSK Captain: ఎంఎస్ ధోనీ తరువాత సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి.. ఎల్లో ఆర్మీలో గుబులు.. నేనే అంటున్న సీనియర్ క్రికెటర్!


ఐసీసీ టోర్నీలో టీమ్‌ఇండియా గెలవకపోవడమే రవిశాస్త్రి కోచింగ్‌లో లోటు. 2015 నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్‌ విజేతగా ఆవిర్భవించలేదు. వన్డే, టీ20, ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో సెమీస్‌ లేదా ఫైనళ్లలో ఓడింది. కోచ్‌గా కొనసాగేందుకు శాస్త్రి అంగీకరించకపోవడంతో బీసీసీఐ రాహుల్‌ ద్రవిడ్‌ను సంప్రదించినట్టు తెలిసింది. అతడు తాత్కాలిక కోచ్‌గా  ఉంటానని చెప్పడంతో.. కొత్త కోచ్‌ పదవికోసం నోటిఫికేషన్‌ ఇవ్వక తప్పదని తెలిసింది.  కాగా టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రవిశాస్త్రికి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.


Also Read: IPL 2021 Update: అభిమానులకు శుభవార్త! ఇక ఐపీఎల్‌ను స్టేడియాల్లో చూడొచ్చు.. షరతులు వర్తిస్తాయి!