రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి (Mumbai), మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. తొలిరోజే ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన ముంబయి పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. కీలక వికెట్లన్నీ పడగొట్టిన మధ్యప్రదేశ్ తగ్గేదే లే అంటోంది. ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (78; 163 బంతుల్లో 7x4, 1x6) అదరగొట్టాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (47; 79 బంతుల్లో 5x4, 1x6) అతడికి అండగా నిలిచాడు.


Also Read: షాకింగ్‌ న్యూస్‌! ఇంగ్లాండ్‌లో విరాట్‌కు కరోనా పాజిటివ్‌!! మరికొందరికీ..?


Also Read: డీకేను పొగిడేందుకు ధోనీపై పంచ్‌లేసిన ఆకాశ్ చోప్రా!!


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయికి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా, జైశ్వాల్‌ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం అందించారు. నిలదొక్కుకున్న ఈ జోడీని షాను ఔట్‌ చేయడం ద్వారా అనుభవ్‌ అగర్వాల్‌ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన అర్మాన్ జాఫర్‌ (26) సైతం చక్కగానే ఆడాడు. అతడిని కుమార్‌ కార్తీకేయ ఔట్‌ చేశాడు. జట్టు స్కోరు 147 వద్ద సువెద్‌ పార్కర్‌ (18)ను శరణ్ష్‌ జైన్‌ పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే శతకం వైపు దూసుకెళ్తున్న జైశ్వాల్‌ను అనుభవే ఔట్‌ చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (40 బ్యాటింగ్‌), షామ్స్‌ ములాని (12 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచి ముంబయి స్కోరును 248కి చేర్చారు.