టీమ్‌ఇండియా సీనియర్‌ క్రికెటర్‌ అజింక్య రహానె బీసీసీఐ సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు! రంజీ ట్రోఫీ ఆడి ఫామ్‌లోకి రావాలన్న బోర్డు పెద్దలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు! సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కఠినమైన పరిస్థితుల్లో శతకంతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం శతకం బాదేశాడు.


దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మొదలైంది. కరోనా వల్ల ఇన్నాళ్లూ దేశవాళీ క్రికెట్లో అత్యున్నతమైన ఈ ట్రోఫీని నిర్వహించలేదు. ఇందులో భాగంగా మొతేరాలో సౌరాష్ట్ర, ముంబయి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా (1), ఆకర్షిత్‌ గోమెల్‌ (8) త్వరగా పెవిలియన్‌ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఎస్‌ఎం యాదవ్‌ సైతం 19 పరుగులకే ఔటయ్యాడు. కఠిన పరిస్థితుల్లో అజింక్య రహానె (108*; 250 బంతుల్లో 14x4, 2x6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (121*; 219 బంతుల్లో 15x4, 2x6) రక్షించారు. సౌరాష్ట్ర బౌలర్లను నిలకడగా ఎదుర్కొన్నారు. తొలి రోజు ఆట ముగిసే సరికి 263 స్కోర్‌ అందించారు.


రెండేళ్లుగా అజింక్య రహానె ఫామ్‌లో లేడు. నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టీమ్‌ఇండియాకు విలువైన ఇన్నింగ్సులు ఆడుతున్నప్పటికీ అతడి నుంచి జట్టు యాజమాన్యం మరింత ఆశిస్తోంది. యువకులైన శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి క్రికెటర్లు పోటీ ఇస్తున్నారు. దాంతో రహానెపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రోహిత్‌సేన వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడుతోంది. ఇది కాగానే శ్రీలంక జట్టు భారత్‌కు వస్తుంది. రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఆ జట్టుతో టెస్టు సిరీసుకు ఎంపికవ్వాలంటే రంజీ ట్రోఫీలో రాణించి, ఫామ్‌ చాటుకోవాలని రహానె, పుజారాకు సెలక్టర్లు సూచించారు. అందుకు తగ్గట్టే రహానె శతకంతో దుమ్మురేపాడు.


ఐపీఎల్‌ వేలంలో అజింక్య రహానెను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కనీస ధరకే కొనుగోలు చేసింది. బహుశా అతడు వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. గతంలో రహానెకు ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. అతడి బ్యాటింగ్‌ కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది కానీ బాగానే పరుగులు చేయగలడు. తాజాగా అతడు ఫామ్‌లోకి రావడంతో కేకేఆర్‌ ట్వీట్‌ చేసి సంతోషించింది.