పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త ఛైర్మన్ ఎంపికయ్యారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, 1992 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడు అయిన రమీజ్ రాజాను ఈ పదవి వరించింది. మూడేళ్ల పాటు రమీజ్ రాజా ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఆయన ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికయ్యారు. కేవలం రమీజ్ రాజా మాత్రమే తన నామినేషన్ పత్రాలను సమర్పించగా, ఆరుగురు సభ్యులతో కూడిన పీసీబీ గవర్నింగ్ బోర్డు సభ్యులు ఆయనకు ఆమోదముద్ర వేశారు.
ఆగస్టు 27వ తేదీన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా రమీజ్ రాజాను ఈ పదవికి నామినేట్ చేశారు. దీంతో అప్పటివరకు రేసులో ఉన్న ఎహసాన్ మణి తప్పుకోక తప్పలేదు. పీసీబీకి రమీజ్ రాజా 30వ అధ్యక్షుడు కావడం విశేషం. ఇజాజ్ భట్, జావేద్ బుర్కీ, అబ్దుల్ హఫీజ్ కార్దర్ తర్వాత ఈ పదవిని చేపట్టిన నాలుగో మాజీ క్రికెటర్ రమీజ్ రాజానే.
నామినేషన్ వేసినప్పటి నుంచి రమీజ్ రాజా పాకిస్తాన్ ఆటగాళ్లను, పీసీబీ అధికారులను క్రమం తప్పకుండా కలుస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికలో కూడా తన హస్తం ఉందని తెలుస్తోంది. ఈ జట్టును ప్రకటించిన కొద్ది గంటలకే జట్టు హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ రాజీనామాలను బోర్డుకు అందించారు.
తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారందరికీ రమీజ్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ లో పాకిస్తాన్ ఎదుగుదలకు తన వంతు కృషి చేస్తానన్నారు. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు కల్చర్, మైండ్ సెట్, యాటిట్యూడ్ లో మార్పులు చేసి మిగతా ప్రపంచ జట్లు భయపడిన ఒకప్పటి పాకిస్తాన్ జట్టుగా మారుస్తానన్నారు.
రమీజ్ రాజా 1984 నుంచి 1997 వరకు క్రికెట్ ఆడారు. ఈ కాలంలో 255 అంతర్జాతీయ టెస్టు, వన్డే మ్యాచ్ లు ఆడి 8,674 పరుగులు సాధించారు.
Also Read: Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..