PV Sindhu enters Singapore Open 2022: భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) అద్భుతం చేసింది. సింగపూర్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ చేరుకుంది. జపాన్‌ అమ్మాయి సయినా కవాకమితో జరిగిన సెమీస్‌లో 21-15, 21-7 తేడాతో విజయం సాధించింది. తక్కువ ర్యాంకు ప్రత్యర్థిని కేవలం 31 నిమిషాల్లోనే ఇంటికి పంపించేసింది. స్వర్ణం సాధిస్తే 2022లో సింధు ఖాతాలో తొలి సూపర్‌ 500 టైటిల్‌ పడుతుంది.


తక్కువ ర్యాంకు షట్లర్‌ కవాకమిని సింధు అల్లాడించింది. వీరిద్దరూ గతంలో తలపడిన రెండు మ్యాచుల్లోనూ తెలుగు తేజానిదే పైచేయి. సెమీస్‌లోనూ ఆమె అదే జోరు ప్రదర్శించింది. వరుస స్మాష్‌లతో చెలరేగింది. 24 ఏళ్ల కవాకమికి ఆమెను నిలువరించడం సాధ్యమవ్వలేదు. ఒకానొక దశలో వీరిద్దరూ ప్రతి పాయింటు కోసం శ్రమించాల్సి వచ్చింది. రెండు సార్లు వీడియో రిఫరల్స్‌ గెలిచిన సింధు బేస్‌లైన్‌ వద్ద మెరుగైన ఆటతో 18-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బలమైన స్మాషులు సంధించడం, ప్రత్యర్థి అనవసర తప్పిదాలతో ఓపెనింగ్‌ గేమ్‌ కైవసం చేసుకుంది.


రెండో గేమ్‌లో కవాకమి తేలిపోయింది. షటిల్‌పై నియంత్రణ లేకపోవడంతో 0-5తో వెనకబడింది. సింధు అదే పనిగా ర్యాలీలు ఆడించి ప్రత్యర్థిని దెబ్బతీసింది. తప్పులు చేసేలా ఉసిగొల్పింది. 11-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగించి 17-5తో విజయానికి చేరువైంది. 21-7తో గేమ్‌తో పాటు మ్యాచునూ ముగించింది.