IPL-2021 సెకండ్ హాఫ్ సీజన్ కోసం జట్లు అన్ని సన్నద్దం అవుతున్నాయి. పలు కారణాల వల్ల ఈ సారి విదేశీ ఆటగాళ్లు కొందరు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కి దూరం కాబోతున్నారు. దీంతో ఆయా ఫ్రాంఛైజీలు ఖాళీ ఉన్న స్థానాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ఆసీస్ ఆటగాడు నేథన్ ఎలిస్‌తో పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
మార్చిలో జరిగిన తొలి దశలో పంజాబ్ కింగ్స్‌కు జే రిచర్డ్‌సన్, రిలే మెరిడీత్ ఆడారు. పలు కారణాల వల్ల వీరిద్దరూ ఇప్పుడు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రిచర్డ్‌సన్ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు నేథన్ ఎలిస్‌ను తీసుకున్నారు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ట్విటర్ ద్వారా అధికారిక ప్రకటన కూడా చేసింది. మరోపక్క మెరిడీత్ స్థానంలో మాత్రం ఇంకా ఎవర్నీ తీసుకోలేదు. ఐపీఎల్ 2021లో 8 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. మిగతా 6 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉంటాయి.
ఏడాది కాలంగా ఎలిస్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ నుంచి మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్ సిరీసులో ఆడాడు. ఎలిస్ బంగ్లాదేశ్‌తో తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యట్రిక్ సాధించాడు. ఇక టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన బృందంలోని ముగ్గురు రిజర్వు ఆటగాళ్లలో ఎలిస్ ఉన్నాడు.
సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మిగతా మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌లోని కొందరు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. తొలి దశలో ఐపీఎల్‌కు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ రెండో దశ ఆడనున్నాడు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ మరింత పటిష్ఠం కానుంది.