పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు రెండు పసిడి పతకాలు వచ్చాయి. ఈ రోజు ఉదయం మహిళల ఆర్ - 2 పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అవని లేఖర పసిడి పతకం ముద్దాడింది. అలాగే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించాడు.  






పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో అతడు మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో మరోసారి తన రికార్డునే తానే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.






మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్‌ బురియన్‌ 66.29 మీటర్లతో రజతం సాధించగా, శ్రీలంక అథ్లెట్‌ దులాన్‌ కొడితువక్కు 65.61 మీటర్లతో కాంస్యం కైవసం చేసుకున్నాడు. భారత్‌ ఇవాళ మొత్తం ఐదు పతకాలు సాధించగా.. అందులో రెండు స్వర్ణ పతకాలు కావడం విశేషం.