7 Ball Over in IND vs PAK Match: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో (Women's T20 WC) ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 13వ తేదీ) భారతదేశం, పాకిస్తాన్ (INDW vs PAKW) జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్ చివరి బంతికి భారత జట్టు విజయం సాధించింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక పెద్ద తప్పిదం జరిగింది. భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 7వ ఓవర్‌లో పాక్ బౌలర్ ఆరుకు బదులు ఏడు బంతులు వేసింది. ఆ ఏడో బంతికి పాక్ బౌలర్ బౌండీరని కూడా సమర్పించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో పాక్ క్రికెట్ అభిమానులు ఈ తప్పును పాక్ ఓటమికి ఒక కారణమని ఆరోపిస్తున్నారు.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దీనికి స్పందనగా పవర్ ప్లేలో నెమ్మదిగా ప్రారంభించిన భారత జట్టు మొదటి ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ నిదా దార్ ఏడో ఓవర్ వేయడానికి వచ్చింది. తను వేసిన మొదటి ఆరు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి.
ఆ తర్వాత అతను పొరపాటున ఏడో బంతి వేసింది. అయితే ఈ విషయాన్ని బౌలర్ కూడా గమనించలేదు. నిదా దార్ వేసిన ఈ అదనపు బంతిని భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్జ్ అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా తన జట్టుపై కొంత ఒత్తిడిని తగ్గించింది. ఇక్కడ బౌలర్‌తో పాటు అంపైర్ వైపు నుంచి కూడా తప్పు జరిగింది.
ఈ ఎక్స్‌ట్రా బాల్ మొదట అంత భారంగా అనిపించలేదు కానీ ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి చేరువ అవుతున్నప్పుడు ఈ బంతి విలువ తెలిసింది. వాస్తవానికి ఒక దశలో భారత జట్టు విజయానికి నాలుగు ఓవర్లలో 41 పరుగులు అవసరం. అక్కడ అదనంగా నాలుగు పరుగులు ఉంటే భారత జట్టుపై రన్ రేట్ ఒత్తిడి మరింత పెరిగి ఉండేది. ఈ తప్పిదంతో పాక్ అభిమానులు మైదానంలో ఉన్న అంపైర్లను టార్గెట్ చేశారు.
ఇక మహిళల టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్జ్ (53 నాటౌట్: 38 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (33: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు), యస్తిక భాటియా (17: 20 బంతుల్లో, రెండు ఫోర్లు) మొదటి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన స్మృతి మంథన స్థానంలో జట్టులోకి వచ్చిన యస్తిక భాటియా కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించింది.
యస్తిక భాటియా అవుటైన కాసేపటికే షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ (16: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటయ్యారు. అయితే జెమీమా రోడ్రిగ్జ్ (53 నాటౌట్: 38 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), రిచా ఘోష్ (31 నాటౌట్: 20 బంతుల్లో, ఐదు ఫోర్లు) మరో వికెట్ పడకుండానే మ్యాచ్‌ను ముగించారు. చివరి నాలుగు ఓవర్లలో టీమిండియా విజయానికి 41 పరుగులు అవసరం కాగా, వీరిద్దరూ కేవలం మూడు ఓవర్లలోనే ఛేదించారు. ఈ క్రమంలోనే జెమీమా రోడ్రిగ్జ్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.