Vinesh Phogat disqualified, will miss wrestling medal in Paris: వంద గ్రాముల అధిక బరువు, వంద కోట్ల మంది భారతీయుల ఆశలను గల్లంతు చేసింది.. ఇక పతకం ఖాయమని... రెజ్లింగ్ లో తొలి పతకం వచ్చిందని చేసుకున్న సంబరాలు పూర్తి కాకముందే పిడుగులాంటి వార్త వినపడింది. వినేశ్ ఫోగాట్(Vinesh Phogat) పై అనర్హత వేటు పడింది. ఈ వార్తతో భారత అభిమానుల హృదయం ముక్కలైంది. ప్రపంచ చాంపియన్ ను ఓడించిన వినేశ్ కు... ఆ ఆనందం 8 గంటల్లోనే కనుమరుగు అయింది. ఈ బాధను దిగమిండటం అభిమానుల తరం కావడం లేదు.. ఈ తీవ్ర నిరాశతో అభిమానులు విచారంలో మునిగిపోయారు. కన్నీళ్ళను దిగమింగుతూ...తదుపరి పోరాటానికి సిద్ధమవుతున్నారు.
వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు గురించి భారత ఒలింపిక్ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వినేశ్‌పై వేటు పడినట్టుగా తెలిపింది. అయితే ఈ విషయంలో వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామంది. అసలు అనర్హత వేటు వార్తలను పంచుకోవడం తమకు అత్యంత బాధ కలిగిస్తోందని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.
ఎన్నో అనుమానాలు ..
వినేశ్ ఫొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై సవాల్ చేసేందుకు ఐవోఏ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఏదన్నా పోటీ జరిగే రోజున కొన్ని గంటల ముందు బరువుతోపాటు వైద్య పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తారు. అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫొగాట్, కొన్ని గంటల తరువాత, బుధవారం ఉదయానికే బరువు పెరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒలింపిక్ కమిటీ ఈ విషయం పై పునఃసమీక్ష చేయటానికి నిరాకరిస్తే మాత్రం ఫొగాట్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. వినీష్ అనర్హతపై మాత్రం అభిమానులే కాదు పలువురు నేతలు సైతం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినేశ్ ఓడించిన వీరెవరూ తక్కువ వారు కాదు.
వినేష్ ఫోగట్ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ జపాన్‌కు చెందిన యుయి సుసాకి(Yui Susaki)ని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ యూరోపియన్ ఛాంపియన్, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై గెలిచింది, .. సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన పాన్ అమెరికన్ గేమ్స్ ఛాంపియన్ యుస్నీలిస్ గుజ్మాన్‌పై వినేశ్ విజయాలు సాధించింది. సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేశ్ రికార్డు సృష్టించింది.