Vinesh Phogat through to final: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో భారత్ (India) నేడు కీలక మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. భారత్‌కు స్వర్ణ కాంతులు అందించేందుకు వినేశ్ ఫొగాట్(Vinesh Phogat నేడు బరిలోకి దిగనుంది. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి మంచి ఫామ్‌లో ఉన్న వినేశ్ ఇప్పటికే కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు యావత్ భారతం ఎదురుచూస్తోంది రజతంకాదు.. స్వర్ణం కోసం. వినేశ్ ఫొగాట్‌కు వచ్చిన పతకం రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం. ఆ తొలి పతకమే స్వర్ణమే అయితే ఇక అంతకన్నా కావాల్సిందేమీ లేదు. అందుకే కోట్ల మంది అభిమానుల ఆశలను మోస్తూ వినేశ్ ఫొగాట్... నేడు ఫైనల్లో ఆ బంగారు పతకమేదో అందిస్తే... ఇక పండుగ చేసుకునేందుకు అభిమానులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ స్వర్ణ పతక పోరు రాత్రి 12 గంటల 30 నిమిషాలకు జరగనుంది. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
వినేశ్ ఓడించిన వారందరూ ఛాంపియన్లే
వినేష్ ఫోగట్ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ జపాన్‌కు చెందిన యుయి సుసాకి(Yui Susaki)ని ఓపెనింగ్ ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్-ఫైనల్స్‌లో యూరోపియన్ ఛాంపియన్, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై.. సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన పాన్ అమెరికన్ గేమ్స్ ఛాంపియన్ యుస్నీలిస్ గుజ్మాన్‌పై వినేశ్ విజయాలు సాధించింది. సెమీఫైనల్లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేశ్ రికార్డు సృష్టించింది.
ఫేవరెట్ కాకపోయినా
ఒలింపిక్ క్రీడల్లో మహిళల మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి రెజ్లర్‌గా ఖ్యాతి గడించిన వినేష్ ఫోగట్... ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో సరైన ప్రదర్శన మాత్రం చేయలేదు. కానీ పారిస్ ఒలింపిక్స్ 2024లో తన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ నంబర్ 1, ఒలింపిక్ ఛాంపియన్ యుయి సుసాకిపై విజయం సాధించదంటే ఆమె ఎంత అంకిత భావంతో, శ్రమతో ఫైనల్‌కు చేరిందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందించేందుకు ఈ స్టార్ రెజ్లర్ సిద్ధంగా ఉంది. పారిస్ గేమ్స్ ప్రారంభమైన 11వ రోజున భారత్‌కు బంగారు పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. వినేశ్ ఫొగాట్ దూకుడు చూస్తుంటే ఫైనల్లో ఆమె హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ చివరి పట్టు కూడా గట్టిగా పట్టేసి విజయం సాధించి భారత్‌కు గోల్డ్ మెడల్ అందిస్తే ఆ ఉద్విగ్న క్షణాలను ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్ జరిగేది అర్ధరాత్రే అయినా వేయి కళ్లతో మేల్కొనేందుకు కూడా సిద్ధమైపోయారు. అందుకే వినేశ్ గెలవాలి... దేశం సంబరాలు చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ వినేశ్