టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలు రేపిన భారత డిస్కస్ త్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్లో మాత్రం నిరాశపరిచింది. బంగారం సాధిస్తుందని ఆశలు పెట్టున్న పంజాబ్ అమ్మాయి కమల్‌ప్రీత్ కౌర్ 6వ స్థానంలో నిలిచింది. అయిదో ప్రయత్నంలో 61.37మీటర్లు విసిరిన కమల్‌ప్రీత్ నిర్ణయాత్మక చివరి రౌండ్లో ఫౌల్ కావడంతో పతకం ఆశలు చేజారాయి. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో ఆరో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
వర్షం కారణంగా డిస్కస్ త్రో ఫైనల్స్ నిర్వహణకు మధ్యలో ఆటంకం తలెత్తింది. అమెరికా అథ్లెట్ అల్‌మన్ వలరీ రికార్డు స్థాయిలో 68.98 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. జర్మనీకి చెందిన క్రిస్టిన్ పుడెన్ 66.86మీటర్లు డిస్క్ విసిరి రజతం అందుకోగా, క్యూబాకి చెందిన అథ్లెట్ యైమె పెరెజ్ కాంస్యం సాధించింది. యైమె పెరెజ్ 65.72 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలవగా.. భారత్ ఆశాకిరణం కమల్‌ప్రీత్ కౌర్ 63.70 మీటర్లు మాత్రమే డిస్క్ విసిరి ఆరో స్థానం దక్కించుకుంది.
Also Read: PV Sindhu Gopichand: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం.. గోపిచంద్ పాత్రేమీ లేదు.. పీవీ సింధు
తొలి ప్రయత్నంలో 61.62 మీటర్లు, రెండో ప్రయత్నంలో ఫౌల్, మూడో ప్రయత్నంలోనూ ఆశించిన దూరం డిస్కస్ విసరడంలో విఫలమైంది. తొలి రౌండ్లో విసిరిన 63.70 మీటర్లే కమల్‌ప్రీత్ కౌర్ అత్యుత్తమ ప్రదర్శన. టాప్8లో నిలిచిన వారికి మరో మూడు పర్యాయాలు డిస్కస్ వేయడానికి అవకాశం ఇస్తారు. అమెరికాకు చెందిన ఆల్మన్ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లు విసరడంతో కమల్‌ప్రీత్ మానసికంగా కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది. మరోవైపు వర్షం అంతరాయం కారణంగా ఆటపై ఫోకస్ చేయడం కంటే ఒత్తిడి అధికం కావడంతో 65 మీటర్లను చేరుకోలేక టాప్ 5లో చోటు దక్కించు కోలేకపోయింది.
కాగా, ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భాగంగా డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు వెళ్తారు. కాగా, కమల్ ప్రీత్ 3వ ప్రయత్నంలో సరిగ్గా 64 మీ. విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మొత్తం మూడు రౌండ్లపాటు జరిగిన డిస్కస్‌త్రోలో అర్హత పోటీల్లో కమల్‌ప్రీత్ తొలి రౌండ్‌లో 60.29, రెండో రౌండ్‌లో 63.97, మూడో రౌండ్‌లో 64 మీటర్ల దూరం విసరడం విశేషం. లండన్, రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు కొల్లగొట్టిన క్రొయేషియాకు అథ్లెట్ సాండ్రా పెర్కోవిక్ 63.75 మీటర్లు మాత్రమే విసరడం తెలిసిందే. అర్హత పోటీల్లో ప్రతి ప్రయత్నంలో కమల్ ప్రీత్ పుంజుకుంది. కానీ, ఫైనల్‌కి వచ్చేటప్పటికి మాత్రం అనుకున్న ప్రదర్శన చేయలేకపోయింది. కమల్‌ప్రీత్ ఈ ఏడాది ప్రారంభంలో 66.59 మీటర్ల ఉత్తమ త్రో తో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒకవేళ ఇంతే దూరం డిస్క్ విసిరింటే ఆమెకు రజత పతకం లభించేంది.