వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా స్టార్ షట్లర్ పీవీ సింధు నిలిచింది. సెమీఫైనల్లో ఓటమి అనంతరం సైతం తాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పట్టుదలతో ఆడి కాంప్యం పోరులో ఘన విజయాన్ని అందుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాంస్య పతకం సాధించిన పీవీ సింధు నేటి (సోమవారం) ఉదయం వర్చువల్‌గా మీడియాతో ముచ్చటించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం గెలవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సైతం నెగ్గకుండా కెరీర్ ముగిస్తుంటే, తెలుగు తేజం పీవీ సింధు రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టింది.


వ‌రుస‌గా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించారు. రెండోసారి సాధించిన ఈ మెడ‌ల్‌లో పుల్లెల గోపీచంద్ కృషి, పాత్ర ఏమైనా ఉందని మీడియా అడిగింది. ఈ ప్రశ్నకు సింధు కాస్త భిన్నంగా స్పందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంలో గోపిచంద్ సార్ పాత్ర ఏమీ లేదని చెప్పింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం వెనుక ప్రస్తుత కోచ్ పార్క్ టే సంగ్ కృషి దాగి ఉందని స్పష్టం చేసింది. ‘నా కోచ్ పార్క్‌తో గత ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఉన్నాను. ఏడాదిన్న‌ర‌ కాలం నుంచి కోచ్ పార్క్ శిక్షణలో ప్రతిరోజూ ప్రాక్టిస్- చేశాను. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు క్రమం తప్పకుండా పాటించాను. టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ రావడంలో కోచ్ కీలకపాత్ర పోషించారని’ పీవీ సింధు పేర్కొంది. 


‘సెమీస్‌లో కాస్త ఒత్తిడికి లోను కావడంతో ఓటమి చెందాను. చాలా హార్డ్ వ‌ర్క్ చేశాను. సెమీస్‌లో ఫ‌స్ట్ సెట్ చాలా బాగా ఆడాను. కానీ సెకండ్ సెట్‌లో కొన్ని అనుకొని త‌ప్పులు జ‌రిగాయి. అయినా వాటిని అధిగమించే ప్ర‌య‌త్నం చేశా. ఆట‌లో ఒక‌రు గెలవడం, మరొకరు ఓటమి చెందడం జరుగుతుంది. గెలుపు ఓట‌ములు స‌హ‌జం. అయినా టోక్యో నుంచి పతకం సాధించి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా వ‌ర‌స‌గా రెండో ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించ‌డం గొప్ప అనుభూతి. మరో ఒలింపిక్ మెడల్ రావ‌డం చాలా గ‌ర్వ‌కార‌ణంగా ఉందని’ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ఓవరాల్‌గా గొప్ప అనుభూతి అని సింధు చెప్పుకొచ్చింది.


సింధు పతకం నెగ్గడంపై ఆమె కంటే కూడా కోచ్ పార్క్ టే సంగ్ అధికంగా సంతోషంగా ఉన్నారు. తన వద్ద శిక్షణ తీసుకున్న వారిలో ఓ క్రీడాకారిణికి తొలిసారిగా ఓ పతకం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘పీవీ సింధు చాలా బాగా ఆడింది. నేను చాలా మందికి కోచింగ్ ఇచ్చాను. కానీ నాకు ఒలింపిక్ మెడల్ సాధించి ఇచ్చిన ఒక్క ప్లేయర్ సింధు మాత్ర‌మే. సింధు సెమీఫైనల్లో తైజూ యింగ్‌తో జరిగిన మ్యాచ్ కొంత నిరుత్సాహానికి లోను చేసింది. కానీ కాంస్య పతకం నిర్ణయాత్మక మాత్రలో విశ్వాసం కోల్పోకుండా ఆడ‌టం వ‌ల్ల‌ విజ‌యం సాధించింది. నాకు కోచ్ గా అవ‌కాశం ఇచ్చిన భార‌త్‌కు కృత‌జ్ఞ‌త‌లు’ తెలిపారు సింధు కోచ్ పార్క్.