ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన పీవీ సింధుకు.. తాను ఇచ్చిన హామీ మేరకు... ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనూహ్యమైన బహుమతి ఇవ్వనున్నారు. ఆ బహుమతి గురించి ప్రధాని మోడీ ముందుగానే సింధుకు చెప్పారు. ఇంతకూ అదేమిటో తెలుసా... ? ఎవరూ ఊహించనిది..! అదే ... ఐస్ క్రీమ్. అవును.. నిజంగానే ఐస్ క్రీమ్ . కొద్ది రోజుల కిందట ఒలింపిక్స్‌కు వెళ్లే ఆటగాళ్లతో ప్రధాని మోడీ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. పతకాల కోసం ఆటగాళ్లు ఎలా శ్రమిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. పీవీ సింధుతో మాట్లాడినప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా వర్చువల్ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు... గేమ్ కోసం.. పతకం కోసం ఎంత కష్టపడుతుందో వివరించారు. ఎంత నిష్టగా ఆహార నియమాలు పాటిస్తుందో చెప్పారు. ఈ సందర్భంగా... పీవీ సింధుకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను కూడా చాలా కాలంగా త్యాగం చేసిందని చెప్పారు. ఈ మాట విన్న ప్రధాని మోడీ... ఒలింపిక్స్‌లో పతకం తీసుకు వస్తే... తనతో కలిసి ఐస్‌క్రీమ్ తినవచ్చునని హామీ ఇచ్చారు.
ప్రధానితో ఐస్ క్రీమ్ తినే అవకాశం కోసమైనా పతకం సాధించాలన్న పట్టుదలను ఆమెలో కల్పించేందుకు మోడీ ప్రయత్నించారు. సింధు కఠోర శ్రమ ఫలించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో సింధు తండ్రి ఆనందానికి కూడా అవధుల్లేవు. సింధు గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన పీవీ రమణ... ఇప్పుడు సింధు.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీమ్ తినవచ్చునని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేకంగా విజేతల్ని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ సందర్భంగా పీవీ సింధుకు, ప్రధాని మోడీ ఐస్ క్రీమ్ ఆఫర్ చేసే అవకాశం ఉంది.
మంగళవారం లేదా బుధవారం పీవీ సింధు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. టోక్యో నుంచి వర్చువల్‌గా మీడియాతో ఇంటరియాక్ట్ అయిన పీవీ సింధు కూడా... ప్రధానమంత్రితో కలిసి ఐస్ క్రీం తినేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. ఒలింపిక్స్ తొలి రోజు రజతం గెలిచిన మీరాభాయి చానుకు పిజ్జాలంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా డామినోస్ సంస్థ జీవితాంతం ఉచితంగా పిజ్జాలు ఇస్తామని ప్రకటించింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రమంత్రిని కలిసిన సమయంలోనూ వారు పిజ్జాలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి వంతు అనుకోవచ్చు..!