లవ్లీనా బోర్గాయిన్... ప్రస్తుతం యావత్తు భారతం ఆమె పేరే జపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఎవరికీ ఊహకందని విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా క్వార్టర్స్ దూసుకెళ్లడమే ఇందుకు కారణం.
పతకానికి అడుగు దూరమే...
ఈ క్రమంలోనే మంగళవారం నిర్వహించిన 69 కేజీల బాక్సింగ్ విభాగంలో లవ్లీనా 3-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి నదైన్ అపెట్జ్ పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. క్వార్టర్స్‌లో లవ్లీనా... చైనీస్ తైపీ క్రీడాకారిణితో తలపడనుంది. లవ్లీనా క్వార్టర్స్‌లో నెగ్గితే ఏదో ఒక పతకం ఖాయమైనట్లే. అంతకుముందు ఆమెకు తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రౌండ్ ఆఫ్ 16లో తన తొలి బౌట్ ఆడింది.
లవ్లీనా.. అని పేరులో లవ్ ఉందికానీ... రింగ్‌లోకి దిగి ప్రత్యర్థులపై పంచ్ విసిరితే మాత్రం అదిరిపోద్ది. భారత బాక్సింగ్‌లో వేగంగా ఎదిగిన యంగ్ ప్లేయర్ లవ్లీనా బోర్గాయిన్. అసోంలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా.. అనతి కాలంలోనే భారత మహిళా బాక్సర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో సెమీస్ చేరి టోక్యో బెర్తును దక్కించుకుంది. పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది.
అసోం నుంచి తొలి ప్లేయర్
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి అసోం క్రీడాకారిణిగా 22 ఏళ్ల లవ్లీనా.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా... లవ్లీనాను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 7 కిలోమీటర్ల సైకిల ర్యాలీలో పాల్గొన్నారు.
సోదరీమణులే స్ఫూర్తి
లవ్లీనా స్వస్థలం అసోంలోని గోలాఘాట్ జిల్లా, బోరో ముఖియా గ్రామం. తల్లిదండ్రులు టికెన్, మమోని బోర్గాయిన్ చిన్ననాటి నుంచి ఆమెకు ఎంతో ప్రోత్సాహం అందించారు. లవ్లీనా బాక్సింగ్ ఎంచుకోవడానికి కారణం కిక్ బాక్సర్లయిన ఆమె కవల సోదరీమణులు లిచా, లీమా. లవ్లీనాలోని ప్రతిభను గుర్తించిన సాయ్ కోచ్ పాదుమ్.. గువాహటిలోని సాయ్ సెంటర్‌లో శిక్షణకు ఆమెను ఎంపిక చేశాడు.
లవ్లీనా 2017లో తొలిసారి అంతర్జాతీయ పతకాన్ని అందుకుంది. అస్తానాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్, వియత్నాంలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైంది. 2018,2019 మహిళల వరల్డ్ బాక్సింగ్
ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు నెగ్గింది. లవ్లీనాలోని ప్రతిభను గుర్తించిన భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది.
ధ్యానంతో బలంగా మారి
లవ్లీనా మొదట్లో మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యేది. తనకన్నా మెరుగైన క్రీడాకారులతో పోరు అనగానే... మానసిక పోరుకు గురై ముందుగానే ఓటమిని అంగీకరించేది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాన్ని సాధించలేక పోయింది. తన బలహీనతను గుర్తించిన లవ్లీనా దాన్ని అధిగమించేందుకు ఎంతో ప్రయత్నించింది. ధ్యానాన్ని సాధన చేసి.. మానసికంగా బలంగా మారింది. ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడటం, దక్షిణాది యాక్షన్ సినిమాలు చూసేది. ఆమె అభిమాన బాక్సర్ అమెరికాకు చెందిన ఫ్లాయిడ్ మేవెదర్.