Heartbroken Vinesh Phogat fans: ఒలింపిక్స్‌ ఫైనల్లో పాల్గొనకుండా వినేశ్‌ ఫొగాట్‌(Phogat fans)పై అనర్హత వేటు పడడంపై భారత క్రీడాభిమానులతో పాటు భారతప్రధాని సహా పలువురు నిర్వేదం వ్యక్తం చేశారు. వినేశ్‌కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

 

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన వినేశ్ ఫోగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. 'వినేశ్ నువ్వు భారత్‌కు గర్వకారణం. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. దేశ ప్రజలందరిలో స్ఫూర్తి నింపావు. ఇలా జరగడంపై నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను. నీ పట్టుదల నాకు తెలుసు. సవాళ్లను ఎదుర్కోవడమే నీ సహజతత్వం. మరింత బలంతో ముందుకెళ్లాలి. మీ గెలుపు కోసం చూస్తున్నామంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.





స్వర్ణ పతక రేసులో ఉన్న పొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పీడకల అయితే బాగుండు... నిజం కాకపోతే బాగుండని  మహింద్ర ట్వీట్‌ చేశారు.


 

ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ కూడా వినేష్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఇది వినేష్‌కు జరిగిన అవమానం కాదు దేశానికే అవమానమని సంజయ్‌సింగ్‌ అన్నారు. వినేష్ ఫోగట్ ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతున్నారని, ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉందని ప్రకటించి అనర్హులుగా ప్రకటించడం తీవ్ర అన్యాయమని, వినేష్‌కి దేశం మొత్తం అండగా ఉంటుందని సంజయ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని... తక్షణమే, దీనిని అంగీకరించకపోతే, ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని ఆయన ట్వీట్ చేశారు.  

 





 

వైద్యులు వద్దన్నారా?

పారిస్ ఒలింపిక్స్ కోసం బరువు తగ్గవద్దని వైద్యులు ముందే వినేశ్‌ ఫొగాట్‌కు సలహా ఇచ్చారు. 50 ఫ్రీస్టైల్ కేజీల విభాగంలో 100 గ్రాములు అధిక బరువుతో అనర్హత వేటు పడటంతో పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగాట్ పరుగు విషాదకరంగా ముగిసింది. 56 కిలోల సాధారణ బరువు ఉన్న వినేశ్‌.. ఈ ఒలింపిక్స్‌కోసం  బరువు తగ్గింది. ఇది అంత సులభంగా సాగలేదు. కరోనా బారినపడినా వినేష్ అంకిత భావంతో క్రమశిక్షణతో బరువు తగ్గింది. గత ఏడాది ఆగస్టులో వినేష్ లిగమెంట్ టియర్ సర్జరీ చేయించుకున్నాడు.  ఆ సమయంలో ఆమె బరువు 59 కిలోలకు చేరుకుంది. అయితే, 50 కిలోల విభాగంలో ఒలింపిక్స్‌లో బరిలో దిగాలని చూసిన వినేశ్‌... ఆహారం, నీటి తీసుకోవడం గణనీయంగా తగ్గించింది. ఇది సాధారణంగా బలహీనత, గాయాలకు దారి తీస్తుందని వైద్యులు వినేశ్‌కు సలహా ఇచ్చారు. అయితే వినేష్ మాత్రం 50 కేజీల విభాగంలో పోటీపడి పతకం సాధించేందుకు ఆ రిస్క్ తీసుకుంది. పారిస్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్ రెజ్లర్ యుయి సుసాకితో తలపడి విజయంసాధించి చరిత్ర సృష్టించి ఫైనల్ చేరింది. ఇక పతకం ఖాయమనుకుంటున్న వేళ ఈ అనర్హత వేటు పడి భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.