Paris Olympics: ఒలిపింక్స్‌లో పోటీ చేయకుండా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధిక బరువు కారణంగానే ఆమెని తప్పిస్తున్నట్టు ప్రకటించినా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ వెంటనే స్పందించి వినేశ్ ఫోగట్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఛాంపియన్ అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కానీ అటు ప్రతిపక్షాలు మాత్రం ఇది కచ్చితంగా అన్యాయమేనని తేల్చి చెబుతోంది. ప్రభుత్వం దీనిపై సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని వెల్లడించారు. అటు మోదీ మాత్రం వినేశ్ ఫోగట్‌ని ఆకాశానికెత్తేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 


"వినేశ్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌వి. భారత దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వే స్ఫూర్తిదాయకం. ఇవాళ నీకు జరిగింది మా అందరినీ బాధిస్తోంది. మనసులో ఉన్న బాధంతా ఇలా మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావన్నది అర్థం చేసుకోగలను. సవాళ్లు ఎదుర్కోవడం నీకు కొత్తేమీ కాదు. మునుపటి కన్నా దృఢంగా మారతావని ఆశిస్తున్నాను. మేమంతా నీకు అండగా ఉంటాం"


- ప్రధాని మోదీ






అయితే..దీని వెనకాల పెద్ద కుట్ర ఉందంటూ కొందరు వాదిస్తున్నారు. మరో బాక్సర్ విజేంద్ర సింగ్ ఈ వివాదంపై స్పందించారు. 100 గ్రాముల బరువు తగ్గించుకోడానికి కాస్త సమయం ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. గతంలో ఎప్పుడూ  ఏ అథ్లెట్‌కి జరగంది ఇప్పుడు జరిగిందని, ఇది కచ్చితంగా కుట్రేనని ఆరోపించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అనర్హత వేటు నుంచి తప్పించడానికి ఏం మార్గాలున్నాయో వెతకాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. IOA ప్రెసిడెంట్ పీటీ ఉషతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మన ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. అంతే కాదు. అవసరమైతే ఆందోళన చేసైనా అనర్హత వేటు నుంచి తప్పించే మార్గం చూడాలని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. 


 






Also Read: Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్- వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు- 100 గ్రాములతో వంద కోట్ల మంది ఆశలు గల్లంతు