CAS Arbitration court extends deadline till 13 August | పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు పతకం వస్తుందా లేదా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) వినేష్ ఫొగాట్ సిల్వర్ మెడల్ రావాలని అప్పీల్ పై తీర్పును ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఇరువైపులా వాదనలు ముగిశాక, శనివారం రాత్రి 9.30 లోపు తీర్పు వస్తుందన్నారు. కానీ వినేష్ ఫొగాట్ కు పతకంపై తుది తీర్పు పారిస్ ఒలింపిక్స్ 2024 పూర్తయిన తరువాత, అంటే ఆగస్టు 13కి వాయిదా వేశారు. శనివారం రాత్రి వినేశ్ ఫొగాట్ పతకంపై సీఏఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ తీర్పు ఇస్తుందోనని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ చివరి నిమిషంలో సీఏఎస్ తుది తీర్పును మరో మూడు రోజులు వాయిదా వేసింది. అది కూడా ఒలింపిక్స్ పూర్తయ్యాక తీరికగా తీర్పు ఇచ్చేలా మంగళవారం సీఏఎస్ తుది నిర్ణయం వెల్లడించనుంది.
విశ్వ క్రీడల్లో భారత్‌కు ఒక్క స్వర్ణం రాలేదు. అయితే బంగారు పోరులో భారత్ అవకాశం వినేష్ ఫొగాట్ రూపంలో చేజారింది. గత ఒలింపిక్స్ లో క్వార్టర్ వరకు మాత్రమే చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం చెలరేగిపోయింది. ఈసారి కచ్చితంగా పతకంతోనే భారత్ కు తిరిగి వస్తానని తన తల్లికి సైతం మాటిచ్చింది. అందుకు తగ్గట్లుగానే వినేశ్ ఆట ఉంది. మాజీ చాంపియన్ ను సైతం ఓడించి ఒక్కో దశ దాటుకుంటూ 50 కేజీల ఫ్రీ స్టైయిల్ రెజ్లింగ్ మహిళల విభాగంలో ఫైనల్ చేరింది. మరికొన్ని గంటలు గడిస్తే పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అమెరికా రెజ్లర్ తో తలపడాల్సి ఉంది. కానీ వినేష్ ఫొగాట్ 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా ఫైనల్ ఆడనివ్వకుండా డిస్ క్వాలిఫై చేశారు.
వినేశ్ ఫోగాట్‌పై ఫైనల్ ఆడకుండా అనర్హతా వేటు వేయడం సంచలనం రేపింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) నిబంధనలతో ఒలింపిక్ కమిటీ అధిక బరువు అని చెప్పి వినేశ్ పై అనర్హత వేటు వేశారు. అయితే ఫైనల్ వరకు నిబంధనల ప్రకారం తాను బరువు ఉన్నాను కనుక, తనకు సిల్వర్ మెడల్ రావాలని వినేశ్ ఫొగాట్ భావించారు. ఒలింపిక్ కమిటీ తీసుకన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ Court of Arbitration for Sport (CAS) ని ఆమె ఆశ్రయించారు. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్, వినేశ్ తరపున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. వినేశ్ కు రజత పతకం ఎందుకు రావాలో ఆమె తరఫున వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తొలుత శనివారం రాత్రి 9.30కి తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తమ తీర్పును ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: 10 గంటల్లో 4.5 కిలోలు తగ్గిన అమన్, కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా కసరత్తులు