Vinesh Phogat at Paris Olympics 2024 | పారిస్: విశ్వ క్రీడల్లో భారత్‌కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం వినేష్ ఫొగాట్ డిస్ క్వాలిఫికేషన్. పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించి రిటైర్మెంట్ ప్రకటించాలని భావించిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ 100 గ్రాముల బరువు అధికంగా ఉన్న కారణంగా ఆమెను ఫైనల్ ఆడనివ్వలేదు. అయితే జరిగిన అన్యాయంపై వినేష్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)కు అప్పీల్ చేసుకోవడం తెలిసిందే. సీఏఎస్ లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ తరఫున వాదనలు ముగిశాయి. వినేష్ అప్పీల్ స్వీకరించిన సీఏఎస్ శనివారం రాత్రి పారిస్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలలోపు తుది తీర్పు వెల్లడించనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9:30 గంటలకు వినేష్ ఫొగాట్ సిల్వర్ మెడల్ పై తుది నిర్ణయం వెల్లడించనున్నారు.




 


వినేశ్ ఫోగాట్‌పై ఒలింపిక్స్ ఫైనల్ ఆడకుండా అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనలతో ఒలింపిక్ కమిటీ తీసుకన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ Court of Arbitration for Sport (CAS) ని వినేష్ ఫొగాట్ ఆశ్రయించారు. ఈ కేసులో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తరపున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఒకప్పుడు సొలిసిటర్ జనరల్‌గా సేవలు అందించిన సుదీర్ఘ అనుభవం హరీశ్ సాల్వే సొంతం.   దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు ముగిశాయి.


తాను నిబంధనల ప్రకారం సెమీఫైనల్ సైతం నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. కనుక ఆ విషయాన్ని పరిగణించి తనకు సిల్వర్ మెడల్ రావాలని వినేష్ ఫొగాట్ కోరారు. శక్తివంచన లేకుండా భారత్ కు స్వర్ణం అందించాలని యత్నించిన వినేశ్ షొగాట్ ను ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై చేయడంతో ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక రెజ్లింగ్ నుంచి తప్పుకున్నారు. అమ్మా రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను. పతకం తేలేకపోయాను. నన్ను క్షమించు అంటూ భావోద్వేగంతో రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.