టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో నీరజ్ చోప్రాని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. నీరజ్ చోప్రాను పరిశీలించిన వైద్యులు.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
AlsoRead: Dhoni: రెట్రో జెర్సీలో ధోనీ... ఓ యాడ్ షూట్‌లో... దుబాయ్‌లో ధోనీ
కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే అతడు పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు చెప్పినట్లు నీరజ్ చోప్రా స్నేహితులు చెప్పారు. నాలుగు రోజుల క్రితం కూడా నీరజ్ చోప్రా జ్వరం, గొంతునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్తగా అతడికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. తాజాగా మరోసారి నీరజ్ చోప్రా జ్వరం బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారి తన స్వగ్రామమైన సమల్ఖాకు ఈ రోజు చేరుకున్నాడు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు దారి పొడవునా ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు, ప్రజలు చోప్రాకు స్వాగతం పలికేందుకు ఆయన స్వగ్రామానికి వచ్చారు. నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. ఉదయం నుంచి కారు టాప్‌పై నిల్చుని, స్వర్ణ పతకాన్ని అభిమానులకు చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. మూడు రోజుల క్రితమే తీవ్ర జ్వరంతో బాధపడిన నీరజ్... నాలుగైదు గంటలపాటు ఇలా ఊరేగింపులో పాల్గొనడంతో ఎండకి నీరసించిపోయాడు. ఇంటికి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడ్ని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
AlsoRead: T20 World Cup: కోహ్లీ పుట్టిన రోజు నాడు భారత్ ఎవరితో మ్యాచ్ ఆడనుందో తెలుసా?
టోక్యో నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలవడం, సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనడం, తాజాగా ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం తర్వాతి రోజు మోదీ ఇచ్చిన విందులో పాల్గొనడం ఇలా వరుస కార్యక్రమాలతో నీరజ్ చోప్రా బిజీగా గడిపాడు. దీంతో అతడికి తగినంత విశ్రాంతి దొరకలేదు. ఈ కారణంగానే అతడు అస్వస్థతకు గురయ్యాడు.