క్రికెట్ అభిమానుదలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు‌చూసిన T20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. టోర్నీ ఆరంభంలోనే అభిమానులకు కిక్ ఇచ్చేందుకు భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ సిద్ధమైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... నవంబరు 5న భారత క్రికెట్ జట్టు సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పుట్టిన రోజు.






ఏ జట్టుతో మ్యాచ్?
అయితే, కోహ్లీ పుట్టిన రోజు నాడు భారత్ టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఆడబోతోంది. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఏ జట్టుతో ఆడుతుందనేది ఇప్పుడు తెలియదు. ఎందుకంటే టోర్నీకి ముందు పలు జట్లు క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడనున్నాయి. అర్హత సాధించిన జట్లు గ్రూప్ - ఎ, బిలో స్థానం దక్కించుకుంటాయి. వీటిలోని ఓ జట్టుతో భారత్ నవంబరు 5న తలపడనుంది. 






కోహ్లీ శతకం సాధిస్తాడా?


కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో శతకం నమోదు చేసి దాదాపు రెండు సంవత్సరాలు. దీంతో కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు ఫార్మాట్లో శతకం సాధిస్తాడా? లేక టీ20 ప్రపంచకప్‌లో చేస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కోహ్లీ తన పుట్టిన రోజు నాడు అంటే నవంబరు 5న జరిగే మ్యాచ్లో తప్పకుండా శతకం సాధిస్తాడని అభిమానులు సామాజిక మధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. మరి, కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.    






అక్టోబర్‌ 17న  గ్రూప్‌-బి నుంచి మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. ఈ మ్యాచులో ఒమన్‌, పపువా న్యూగినీ తలపడతాయి. సాయంత్రం మ్యాచులో స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌ ఢీకొంటాయి. ఆ తర్వాతి రోజు గ్రూప్‌-ఏలోని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, శ్రీలంకలు అబుదాబిలో పోటీపడతాయి. ఇక సూపర్‌ 12 మ్యాచులు అక్టోబర్‌ 23 నుంచి మొదలవుతాయి.


నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీఫైనల్‌, నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డే కేటాయించారు. అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఒమన్‌తో పాటు యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు.