పారా ఒలింపిక్స్‌ కోసం భారత్ 54 మంది అథ్లెట్ల బృందాన్ని జపాన్‌ పంపనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌కి భారత్ ఈసారి పారాలింపిక్స్ కోసం కూడా భారీ జట్టును పంపుతుంది. 54 మంది అథ్లెట్లు 9 విభాగాల్లో పోటీ పడనున్నారు. ఈ సారి బ్యాడ్మింటన్లో కూడా మన అథ్లెట్లు పోటీపడుతున్నారు.  






ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారిలో స్థైర్యం నింపడంతో పాటు శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. మీరంతా అత్తుత్యమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లగా అభివర్ణించారు. ఒలింపిక్స్‌లో సత్తాచాటాలని ఆకాంక్షించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సైతం పాల్గొన్నారు. 






క‌రోనా మ‌హ‌మ్మారి మీ క‌ష్టాల‌ను రెట్టింపు చేసింది. అయినా మీరు ప్రాక్టీస్ ఆపలేదు. క్రీడాకారుల‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణమే ఇది. పారాలింపిక్స్‌లో మీ విజ‌యాలు, మీరు సాధించ‌బోయే ప‌త‌కాలు దేశానికి ఎంతో ముఖ్యం. ప‌త‌కాల కోసం మీపై ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. అవకాశం వచ్చిన ఒలింపిక్స్‌లో మీరు మీ నుంచి నూరు శాతం ప్రతిభ కనబరిచేందుకు ప్రయత్నించండి. పతకం వస్తుందా? రాదా? అనేది తర్వాతి విషయం అని అన్నారు. 
గుజ‌రాత్‌కు చెందిన‌ పారా-బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పారుల్ ద‌ల్‌సుఖ్‌బాయ్ పార్మర్‌తో ప్రధాని మాట్లాడారు. ‘మీరు మ‌రో రెండేళ్లలో 50వ సంత్సరంలోకి అడుగుపెట్టబోతారు. ఇప్పటి వరకు మీరు మీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం కోసం చాలా క‌ష్టపడి ఉంటారు. ఈ రాఖీ పండుగ‌కు మీరు త‌ప్పకుండా మీ సోద‌రుడికి బ‌హుమ‌తి ఇస్తార‌ని (పారాలింపిక్స్‌లో ప‌త‌కం సాధిస్తార‌ని) అనుకుంటున్నా’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 


రియో పారాలింపిక్స్‌లో భారత్- 4 పతకాలు సాధించింది. అందులో రెండు స్వర్ణ పతకాలు కావడం గమనార్హం. ఈ నాలుగు పతకాలు అథ్లెటిక్స్‌లోవే. హై జంప్‌లో మరియప్పన్ తంగవేలు, జావెలిన్ త్రోలో దేవేంద్ర జజారియా బంగారు పతకాలు సాధించారు. మహిళల షాట్‌పుట్‌లో రజత పతకం సాధించగా, పురుషుల హై జంప్‌లో వరుణ్ సింగ్ భట్టి కాంస్య పతకం సాధించాడు.     


ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలవగా,  మీరాబాయి చాను, రవి దహియా రజత పతాకాలు, పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌ పునియా కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.