భారత్ లో వ్యాక్సినేషన్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. కరోనా నుంచి పూర్తి రక్షణ కల్పించేందుకు వ్యాక్సిన్ ఒకటే శరణ్యమని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ప్రభుత్వం. తాజాగా రికార్డ్ స్థాయిలో 88 లక్షల మందికి ఒక్కరోజులో వ్యాక్సిన్ వేసి చరిత్ర సృష్టించింది భారత్. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇవే టాప్..
దేశంలో అత్యధిక వ్యాక్సిన్ డోసులను అందించిన రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. ఇప్పటివరకు 5.98 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ఈ జాబితాలో యూపీ టాప్ లో ఉంది. అనంతరం 5 కోట్ల డోసులను అందించి మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలో కోటి మందికి పైగా రెండు వ్యాక్సిన్ డోసులను అందించిన ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రలు ఏవీ ఈ రికార్డ్ సాధించలేదు.
ఉత్తర్ ప్రదేశ్ లో జనాభా ఎక్కువ కావడం వల్ల ఇప్పటివరకు 50 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో ఆ రాష్ట్ర విఫలమైంది. ఇప్పటివరకు 31 శాతం మందికే సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించింది యూపీ. బంగాల్, బిహార్, పంజాబ్, ఝార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర.. ఉత్తర్ ప్రదేశ్ కంటే ఎక్కువ శాతం మందికి వ్యాక్సిన్ వేశాయి. ఈ జాబితాలో 77 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి హిమాచల్ ప్రదేశ్ టాప్ లో నిలిచింది. జమ్ముకశ్మీర్ 66 శాతం, ఉత్తరాఖండ్ 64 శాతం, గుజరాత్ 60 శాతం, మధ్యప్రదేశ్ 55 శాతం, కర్ణాటక 54 శాతం, కేరళ 54 శాతం, రాజస్థాన్ 52 శాతం, ఛత్తీస్ గఢ్ 50 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సెంచరీ కొట్టిన ఆ నాలుగు ప్రాంతాలు..
రాష్ట్రాల విషయం పక్కన పెడితే దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఇప్పటివరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ రికార్డ్ ను మొదటగా భువనేశ్వర్ నగరం అందుకుంది. ఆ తర్వాత కేరళలోని వయనాడ్, దాద్రా అండ్ నాగర్ హవేలీలోని డామన్ అండ్ డియూ, మరో యూటీ లద్దాఖ్ తమ ప్రజలకు 100 శాతం తొలి డోసు వ్యాక్సిన్ ను అందించాయి.