Imane Khelif Identified As Man In Leaked Medical Report:  పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) లో అత్యంత వివాదాస్పద బాక్సర్ గా నిలిచిన.. అల్జీరియా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్(Imane Khelif) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెలో పురుష లక్షణాలు ఉన్నాయని.. ఆమెను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలని అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. సాక్షాత్తూ దేశ ప్రధానులు కూడా ఈ వివాదంపై స్పందించారు. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పురుష లక్షణాలు ఉన్న వారిని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల విభాగంలో ఆడనివ్వకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటనలు కొనసాగుతుండగానే మరో ప్రకటన వెలువడింది. ఖలీప్ ఆమె కాదని పురుషుడే అని వెలువడిన ఆ నివేదిక ఇప్పుడు క్రీడా ప్రపంచంలో మరోసారి సంచలనంగా మారింది. ఈ నివేదికతో ఇమానే ఖలీఫ్ కు వచ్చిన ఒలింపిక్స్ బంగారు పతకాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న చర్చ ఆరంభమైంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ కూడా ఖలీఫ్ స్వర్ణ పతాకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


మెడికల్ రిపోర్టులో సంచలన విషయాలు
జాఫర్‌ ఐత్‌ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు సంపాదించిన ఒక పాత డాక్యుమెంట్ల ప్రకారం  ఇమానే ఖలీఫ్  5- ఆల్ఫా రెడక్టేస్‌ డెఫిషియెన్సీతో బాధపడుతోందన్న సంచలన విషయం వెల్లడైంది.  అంతేకాదు...ఇమానే హార్మోన్‌ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే  సమాచారం కూడా ఉంది.. 2023 జూన్‌లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని క్రెమ్లిన్-బికేట్రే హాస్పిటల్  అలాగే  అల్జీరియాలోని అల్జీర్స్‌లోని మొహమ్మద్ లామైన్ డెబాఘైన్ హాస్పిటల్  సహకారంతో ఈ నివేదిక రూపొందించారు. 5- ఆల్ఫా రెడక్టేస్‌ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్‌. జననానికి ముందు  అలాగే  యుక్తవయస్సు సమయంలో జన్యుపరంగా మగవారిగా జన్మించిన వ్యక్తుల లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఈ  వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్‌గా మహిళగా కనిపిస్తారు. అయితే, ​కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లోపం ఉన్నవారు మెరుగైన కండరాల పెరుగుదల, వెంట్రుకల పెరుగుదల , రొమ్ము కణజాలం లేకపోవడంతో ప్రారంభ సంకేతాలుగా ప్రారంభ పురుషత్వానికి దారితీస్తుందని నమ్ముతారు.


ఒలింపిక్స్ లో ఇలా..
ఒలింపిక్స్‌ లో వివాదస్పద బాక్సర్‌గా ముద్రపడింది అల్జీరియా బాక్సర్‌ ఇమాన్ ఖలీఫ్‌. ఓ వైపు ఆమె జెండర్‌పై వివాదం జరుగుతుండగానే ప్రత్యర్ధులపై ఘన విజయాలు సాధించి బాక్సింగ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది ఇమానే. మొదటి నుంచి ఇమాన్ ఖలీఫ్‌ మహిళ కాదు పురుషుడు అని వివాదం జరుగుతుండగా, తన మొదటి బౌట్‌లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్‌లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే  ఏడుస్తూ బౌడ్ నుంచి వెనుదిరిగింది. ఇలాంటి బాక్సింగ్‌ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా  చెప్పుకొచ్చింది. ఓవైపు విమర్శలు కొనసాగుతుండాగా నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు. ఊహించినట్టుగా  ఆమె అందరినీ తలదన్ని ఆమె బంగారు పతకం పొందింది.  ఇమాన్ ఖలీఫ్ శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అసాధారణంగా ఉందన్న కారణంతో  ఆమె ‘లింగ పరీక్ష’లో విఫలమవడంతో 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి నిషేధించారు.