ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు పటిష్టమైన జట్ల మధ్య మరోసారి ఉత్కంఠభరిత పోరు చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన కంగారు జట్టు రెండో మ్యాచ్‌లో గెలిచి గాడిన పడాలని పట్టుదలగా ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. శ్రీలంకపై 102 పరుగుల తేడాతో  విజయదుందుంభి మోగించిన ప్రొటీస్ ఆస్ట్రేలియాపైన గెలిచి సెమీస్‌ వైపు బలంగా అడుగేయాలని భావిస్తోంది. ఇరు జట్లు అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించకపోవడంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో దూకుడు కొరవడడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ 30 పరుగుల మార్కును అధిగమించలేదు. చెపాక్‌లోని స్పిన్‌ పిచ్‌పై టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం కంగారు బ్యాటర్లకు తలకుమించిన భారమైంది.

 

మార్కస్ స్టోయినిస్ గాయం నుంచి కోలుకోవడం ఆసిస్‌కు కలిసిరానుంది. కామెరాన్ గ్రీన్ స్థానంలో స్టోయినిస్‌ జట్టులోకి వస్తాడు. పాట్ కమ్మిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లతో ఆసిస్‌ బౌలింగ్‌ దాడి చాలా బలంగా ఉంది. గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్‌ జంపా స్పిన్‌ విభాగాన్ని నడిపించనున్నారు. 

 

బలంగా ప్రొటీస్‌

ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది.  క్వింటన్ డి కాక్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్‌క్రమ్‌ కూడా సెంచరీలతో ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా మణికట్టు స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పిన్‌ను దక్షిణాఫ్రికా బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొంటారు. వాన్ డెర్ డస్సెన్, కెప్టెన్ టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్, డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, మార్‌క్రమ్‌లతో ప్రోటీస్‌కు విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పేసర్ల ఫామ్ అందోళన కలిగిస్తోంది. ఎన్‌గిడి, జాన్‌సెన్‌, కగిసో రబాడ రాణించాలని ప్రొటీస్‌ కోరుకుంటోంది. 

 

వన్డేల్లో ఇరు జట్లు 108 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 54 మ్యాచుల్లో నెగ్గగా, ఆస్ట్రేలియా 50 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక ప్రపంచ కప్ టోర్నీలో ఆరుసార్లు తలపడ్డగా, ఆసీస్ మూడు విజయాలు, దక్షిణాఫ్రికా రెండు విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 

 

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (సి), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబడా, తబ్రైజ్ శంవాన్‌సి , లిజాడ్ విలియమ్స్.

 

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (సి), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.