మరికాసపట్లో ప్రపంచకప్ వేట ప్రారంభంకానున్న వేళ... టీమిండియా సారధి  రోహిత్‌ శర్మ జట్టు సభ్యులకు దిశా నిర్దేశం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఎవ్వరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండకూడదని స్పష్టం చేశాడు. అందరం జట్టుగా ఆడి భారత్‌కు ప్రపంచకప్‌ అందిద్దామని సూచించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రోహిత్‌ శర్మ... ఈ ప్రపంచకప్‌లో వ్యక్తిగత ప్రాధాన్యతలకు చోటులేదని స్పష్టం చేశాడు. జట్టు కూర్పుపైనా రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాను కేవలం పేసర్‌గానే చూడడం లేదని వెల్లడించాడు. ప్రపంచకప్ స్వదేశంలో జరుగుతుండడంతో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఆడించే అవకాశాలను రోహిత్‌ కొట్టిపారేయలేదు. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తుది జట్టు ఎంపికలో తమ దృష్టిలో ఉన్నారని రోహిత్‌ తెలిపాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌పై ప్లేయింగ్ లెవన్‌లో ముగ్గురూ పాల్గొనవచ్చని రోహిత్ సూచనాప్రాయంగా తెలిపాడు. 



 మీరు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు "అవును, నా ఉద్దేశ్యం ప్రకారం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాను కేవలం సీమర్‌గా పరిగణించను. అతను ఓ అద్భుత బ్యాటర్‌ కూడా. పాండ్యా ఆల్‌రౌండర్‌ కాబట్టి ముగ్గురు, స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో మాకు బరిలోకి దిగే అవకాశం ఉంది" అని రోహిత్ చెప్పాడు. అశ్విన్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలగడంతో అతడు తప్పక తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తమకు ఎనిమిదో నెంబర్‌ వరకు బ్యాటింగ్ చేసే బ్యాటర్లు ఉన్నారని, పిచ్ ఎలా ఉంటుందో చూసి తుది జట్టు విషయంలో ఓ అంచనాకు వస్తామని రోహిత్‌ తెలిపాడు. తాము కచ్చితంగా అత్యుత్తమ లెవన్‌తో బరిలోకి దిగుతామన్న రోహిత్‌... పిచ్‌, అప్పటి పరిస్థితుల ఆధారంగా ఉత్తమ 11 మందిని ఎంచుకుంటామన్నారు.  ప్రపంచకప్ వ్యక్తిగత ప్రాధాన్యాలకు వేదిక కాదన్న రోహిత్‌ ఇక్కడ జట్టే ముఖ్యమని తెలిపాడు. 



 సూర్యకుమార్ యాదవ్ లాంటి  విధ్వంసకర ఆటగాడిని వదులుకుంటారా అన్న ప్రశ్నకు కూడా రోహిత్‌ సూటిగా స్పందించలేదు. తుది జట్టు ఎంపికలో పరిస్థితులను బట్టి స్థానాలు ఉంటాయని తెలిపాడు. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్‌  యాదవ్‌లలో ఎవరిని ఎలా ఉపయోగించుకావాలనే దానిపై తమకు ప్రత్యేక ప్రణాళిక ఉందని రోహిత్‌ స్పష్టం చేశాడు. వారిద్దరూ ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేశారని, వాళ్లకు ఎలా ఆడాలో తెలుసని, చాలా అనుభవం ఉందని కూడా రోహిత్‌ గుర్తు చేశాడు. డెంగీతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ తొలి మ్యాచ్‌కు ఇంకా దూరం కాలేదని కూడా రోహిత్‌ తెలిపాడు. గిల్‌ ఆటకు ఫిట్‌గా ఉండే అవకాశం లేదని మాత్రం రోహిత్‌ పరోక్షంగా చెప్పాడు. గిల్ రేపు ఆడాలని తాను కోరుకుంటున్నానని, కానీ ఆరోగ్యం బాగుంటేనే అతను ఆడగలడని రోహిత్‌ అన్నాడు. 
 మరికాసేపట్లో టీమిండియా ప్రపంచకప్‌ వేటను ప్రారంభించనుంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో భీకరంగా ఉన్న భారత జట్టు.. అయిదుసార్లు ప్రపంచకప్ విజేత, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం రెండు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కానీ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థే కావడంతో భారత్‌ తొలి పోరులో హోరాహోరీ తప్పక పోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు.