వరుస విజయాలతో ఊపుమీదున్న న్యూజిలాండ్‌ బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి మూడో విజయానికి మార్గాన్ని సుగుమం చేసుకుంది. వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 245 పరుగులకు పరిమితమైంది. టాస్‌ గెలిచిన కివీస్‌.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది. బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లకు న్యూజిలాండ్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ట్రెంట్‌ బౌల్ట్‌... లిట్టన్‌దాస్‌ను అవుట్‌ చేసి బంగ్లాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అనంతరం తన్జిద్‌ హసన్‌తో జత కలిసిన హసన్‌ మిరాజ్‌ కాసేపు న్యూజిలాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. కానీ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన అనంతరం 16 పరుగులు చేసిన  తన్జిద్‌ హసన్‌ను ఫెర్గ్యూసన్ అవుట్‌ చేశాడు. మరో 16 పరుగులు జోడించగానే 30 పరుగులు చేసిన హసన్‌ మిరాజ్‌ను అవుట్‌ చేశాడు. 56 పరుగుల వద్దే నాలుగో వికెట్‌ కూడా కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. 



 కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాదేశ్‌ను సారధి షకీబ్ అల్ హసన్, ముష్ఫకీర్‌ రహీమ్‌ ఆదుకున్నారు. అయిదో వికెట్‌కు...... 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. షకీబ్ అల్ హసన్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ముష్ఫకీర్‌ రహీమ్‌ 75 బంతుల్లో  6 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్‌ను  ఫెర్గ్యూసన్... ముష్ఫకీర్‌ రహీమ్‌ను హెన్రీ పెవిలియన్‌కు పంపారు. 13 పరుగులు చేసిన హ్రిడాయ్‌ను బౌల్ట్‌ అవుట్‌ చేయడంతో బంగ్లా 180 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం మహ్మదుల్లా పోరాడడంతో బంగ్లా మళ్లీ పోరులోకి వచ్చింది. 41 పరుగులతో మహ్మదుల్లా బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.



కివీస్‌ బౌలర్లలో ఫెర్య్గూసన్‌ 3, బౌల్ట్‌ 2, హెన్రీ 2, శాట్నర్‌, ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.  ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ మరో విజయంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కివీస్ నాలుగు పాయింట్లతో 1.958 నెట్ట్ రన్‌ రేట్‌ కలిగి ఉంది. ఇండియా కూడా నాలుగు పాయింట్లతో 1.5 నెట్ట్ రన్‌ రేట్‌ కలిగి ఉంది. పాకిస్తాన్ 0.92 నెట్ట్ రన్‌ రేట్‌ కలిగి ఉంది.మొన్నటి వరకు జట్టుకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడం కివీస్ బలాన్ని మరింత పెంచింది. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌తో జరిగిన కివీస్ మ్యాచ్‌లకు విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. ఆ టైంలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ బాధ్యతలు తీసుకున్నాడు.



 చెపాక్ స్టేడియంలో పరుగులు రాబట్టడం అంత ఈజీగా రావని తెలుస్తోంది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 200 పరుగులు చేయడమే కష్టంగా మారింది. ఆ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఆరు వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు బంగ్లా తక్కువ స్కోరుకే అవుట్‌ అయినా బంగ్లా స్పిన్నర్లు ఏమైనా అద్భుతం చేస్తారేమో చూడాలి. స్పిన్ త్రయం కెప్టెన్ షకీబ్ అల్ హసన్, మహేదీ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ అద్భుతం చేయవచ్చని బంగ్లా భావిస్తోంది. వీళ్లు గత రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గిరిపైనే బంగ్లాదేశ్‌ ఆశలు పెట్టుకొంది. స్పిన్‌ త్రయం రాణించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది . ఈ రెండు జట్లు వన్డేల్లో 41 సార్లు తలపడగా, న్యూజిలాండ్ 30 సార్లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 10 సార్లు విజయం సాధించింది.