Novak Djokovic: 


టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్‌ గెలిచాడు. రెండేళ్ల తర్వాత అతడు అమెరికాలో తొలి సింగిల్స్ ఆడటం గమనార్హం. 2019లో చివరి సారిగా ఇక్కడ ఆడగా.. వింబుల్డన్‌ ఫైనల్‌ తర్వాత ఇదే తొలి టూర్‌ లెవల్‌ గేమ్‌.


సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌ స్పెయిన్‌ ఆటగాడు అలెజాండ్రో డావినోవిచ్‌ ఫోకినాతో తలపడ్డాడు. 6-4తో తొలి సెట్‌ కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌ ఆరంభం కాగానే వెన్నునొప్పితో ప్రత్యర్థి ఆట నుంచి తప్పుకున్నాడు. వాకోవర్‌ లభించడంతో జకో నేరుగా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. డావినోవిచ్‌ అతడి ఆధిపత్యం 4-1కి పెంచుకున్నాడు.


మ్యాచ్‌ ఆగిపోగానే జకోవిచ్‌ ప్రత్యర్థి వద్దకు వెళ్లాడు. అతడిని ఊరడిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. త్వరగా కోలుకొని కోర్టులో అడుగు పెట్టాలని కోరుకున్నాడు. కొన్ని రోజుల్లోనే న్యూయార్క్‌లో యూఎస్‌ ఓపెన్‌ మొదలవుతున్న సంగతి తెలిసిందే. మంచి పోటీ చూస్తామని భావించినప్పటికీ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.


ప్రస్తుతం జకోవిచ్‌ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. మొత్తం 1058 విజయాలు, 210 ఓటములతో తిరుగులేని స్థితిలో ఉన్నాడు. 2003 నుంచి ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగు పెట్టిన ఈ సెర్బియన్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు. ఈ గెలుపుతో అతడు సిన్సినాటిలో దూసుకుపోనున్నాడు. యూఎస్‌ ఓపెన్‌కు ముందే ఫామ్‌ అందుకోవాలని, ప్రదర్శన మెరుగు పర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.


సిన్సినాటి ఓపెన్‌ మూడో రౌండ్లో ఫ్రెంచ్‌ ఆటగాడు మోన్‌ఫిల్స్‌తో జకోవిచ్‌ తలపడనున్నాడు. అతడిపై సెర్బియన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పుడూ అదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నాడు.


Also Read: అన్‌ లక్కీ వినేశ్‌! మోకాలి గాయంతో ఆసియా క్రీడల నుంచి ఔట్‌!


Also Read: టీమ్‌ఇండియా నంబర్‌ 4.. విరాట్‌ కోహ్లీ!