అమ్మాయి బాక్సింగ్ నేర్చుకోవడమేంటి..? అందులోనూ ముస్లిం మతాచారాలను ప్రక్కన పెట్టి ముందుకు వెళ్లే సాహసం చేయడమేంటి..? అమ్మాయి బాక్సింగ్ చేస్తే పెళ్లి ఎలా అవుతుంది.. ? ఇలా వెక్కిరింపు మాటలు చెవులకు తాకుతున్నా.. అవమాన భారం వెంటాడుతున్నా.. ఇవేవీ పట్టనట్లు ముందుకు తూటాలా దూసుకుపోయింది నిఖత్ జరీన్. ఈరోజు తన బిడ్డను ప్రపంచం గర్వించేంతలా విజయం సాధించడం వెనుక ఎన్నో అవమానాలు, రాజకీయాలు భరించామని నిఖత్ జరీన్ తల్లిదండ్రులు అంటున్నారు.
ABP దేశంతో తమ బిడ్డ విజయాన్ని పంచుకుంటూ అనేక విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పేరు సంపాదించడం అంటే అందులోనూ మహిళలు బాక్సింగ్ వంటి క్రీడల్లో ముందుకు సాగడం అంత సమాన్య విషయం కాదు. కానీ చిన్నతనం నుండి తాను అందరిలా కాదు.. తన గమ్యం అందరూ ఊహించిది కాదు అంటూ వినూత్నంగ ,తెగువతో ఆలోచించే మనస్తత్వం ఉన్న నిఖత్ జరీన్, ఓ గ్రౌండ్ లో బాక్సింగ్ ఆడటం అందులోనూ మగవాళ్లు మాత్రమే బాక్సింగ్ ఆడటం చూసిన జరీన్ తన తండ్రితో బాక్సింగ్ పై ఉన్న ఆసక్తిని మొదటిసారి బయటపెట్టింది. వద్దమ్మా అని వారించినా వినలేదు. బాక్సింగ్ నేర్చుకుంటా.. తాను బాక్సర్ గా గుర్తింపు తెచ్చుకుంటా అని ఒప్పించింది. నిఖత్ జరీన్ తండ్రి మహ్మద్ జమీల్ ఒప్పుకున్నా.. తల్లి పర్వీన్ సుల్తానా మాత్రం ససేమీరా అనేసింది. అయినా ప్రయత్నం వదలకుంటా తల్లికి నచ్చజెప్పి పంతం నెగ్గించుకుంది జరీన్.
అలుపెరుగని ప్రాక్టీస్.. పట్టువీడని కృషి.. ఇలా బాక్సింగ్ బడిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకుపోయింది. కేవలం ఏడాది కాలంలోనే జాతీయ స్దాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జరీన్ చిన్నతనం నుండే చెట్లు ఎక్కడం, చేతులతో గోడలను బలంగా గుద్దుతూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం చేసేది. దెబ్బలతో ఒళ్లు కందిపోతున్నా.. గాయాలు బాధిస్తున్నా.. వెనక్కు తగ్గలేదు. ఇదే సమయంలో తల్లి తన బిడ్డను చూసి, ఆ మొండితనం చూసి కాస్త కంగారు పడింది. దెబ్బలు తగిలితే పెళ్లి అవ్వడం కష్టం వద్దమ్మా మానేయ్ అని వారించింది. చుట్టుప్రక్కల వారుసైతం వెటకారం మాటలు,సూటిపోటి వెక్కిరింపులతో హేళన చేయడం చూసి బాధపడింది జరీన్ తల్లి. ఎంతకీ కూతురు మాట వినకపోతే సరే చూద్దాం దెబ్బలుతాకి తానే మానేస్తుందిలే అనుకుంది.కానీ తల్లి ఊహలకు అందని విధంగా బాక్సింగ్ లో విల్లువదలిన బాణంలా దూసుకుపోయింది. తాను ఇంతవరకూ తన బిడ్డ బాక్సింగ్ ఆడుతున్నప్పుడు లైవ్ లో చూడలేదని.. తన బిడ్డకు పంచ్ దెబ్బలు తాకుతుంటే భరించలేననే భయంతో లైవ్ వస్తున్నా చూసేదాన్నికాదని జరీన్ తల్లి చెప్పారు.
అవకాశం అందిపుచ్చుకుంటూ దేశవ్యాప్తంగా జరిగిన అనేక బాక్సింగ్ పోటీలతో రాణించి తన సత్తా చాటుతూ ముందుకు సాగింది. గెలిచిన పతకాలు, జ్జాపికలు అనేకం. కోవిడ్19 సమయంలో సైతం ప్రాక్టీస్ వదల్లేదు జరీన్ . ఇంటి టెర్రస్ పై తండ్రి సహాయంతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేది. తండ్రి కూడా క్రీడాకారుడు కావడంతో ప్రోత్సహం వెన్నంటి నిలిచారు. చదువుకు ఆటంకం కలుగకుండా ఓవైపు చదువు మరోపైపు తాను ప్రాణం పెట్టిన బాక్సింగ్ ఇలా రెండింటికీ సమయం కేటాయిస్తూ కష్టపడేది నిఖత్ జరీన్. రోజులో ఆరుగంటల విశ్రాంతి మినహా మిగతా సమయంలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తుండేది. ఒక్క ప్రాక్టీస్ మాత్రమే కాదు డైట్ విషయంలో సైతం ఖచ్చితంగా ఉండేది.
ఇలా బాక్సర్ గా దూసుకుపోతున్న నిఖత్ జరీన్‌కు అప్పటికే ఇండియాలో బాక్సర్ గా రాణిస్తున్న మేరీ కోమ్ తీరు కాస్త ఇబ్బంది కలిగించింది. ఎంతలా అంటే రూల్స్ కు విరుద్దంగా తనను ఎదగనివ్వకుండా చేస్తోందనే ఆవేదన తన బిడ్డలను మానసికంగా కుంగదీసిన సందర్బాలున్నాయని జరీన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన బిడ్డకు ధైర్యం చెప్పి వెన్నుతట్టి నిలబడ్డామని, అవకాశాలు అందరికీ వస్తాయని .. ఒర్పుతో వేచి చూసి ముందుకు దూసుకుపోవాలని తల్లి నింపిన ధైర్యంతో నిఖత్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ప్రపంచస్దాయిలో గుర్తింపే లక్ష్యంగా అడుగులువేసింది. అంతే అది మొదలు తన బిడ్డ ఎక్కడా వెనక్కు తిరిగి చూసుకోలేదు. ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో సర్ణపథకం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళగా తెలంగాణ తాఖత్ చాటింది నిఖత్ జరీన్.
Also Read: Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!