శ్రీలంక విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ మెండిస్‌... పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిపోయాడు. ప్రపంచంలోనే పటిష్టమైన పేసర్లున్న పాకిస్థాన్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన పోరులో కుశాల్‌ మెండిస్‌ 65 బంతుల్లోనే అధ్బుత శకతం సాధించాడు. ఫోర్‌లు, సిక్సర్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిన కుశాల్‌ మెండిస్‌... 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు. అయితే పరుగుల వేగాన్నిపెంచే క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ అవుటయ్యాడు. అయితే దూకుడు మీదున్న సమయంలో కుశాల్ మెండిస్ అవుటైన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక్‌ ఆటగాళ్లు చీటింగ్ చేశారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మెండిస్ అవుటైన తీరుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



 కుశాల్ మెండిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఇమామ్-ఉల్-హక్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే పాక్‌ ఆటగాళ్లు బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టారని ఫోటోలతో సహా నెటిజన్లు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. చీటింగ్‌ పాక్‌ ట్యాగ్‌ లైన్‌తో దాయాది జట్టును విమర్శిస్తున్నారు. బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టిన తర్వాత ఆ తెల్లటి కనిపిస్తున్న గుర్తులు పాకిస్థాన్‌ మరోసారి "మోసం" చేసిందనేందుకు ఆధారాలు అని నెటిజన్లు మండిపడుతున్నారు. 



  ఈ క్రమంలోనే హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 29 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదేశాడు. ఐదో బంతిని కూడా సిక్సర్ కొట్టే ప్రయత్నంలో డీప్ మిడ్ వికెట్లో బౌండరీ లైన్ వద్ద ఇమాన్‌ ఉల్‌ హక్‌కు పట్టిన క్యాచ్‌కు కుశాల్ మెండిస్ అవుటై వెనుదిరిగాడు. అయితే ఈ క్యాచ్ విషయమై ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇమాన్ ఉల్ హక్ క్యాచ్ పట్టిన సమయంలో బౌండరీ రోప్ జరిగి ఉండటం రీప్లేలో కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



  పాకిస్థాన్ ఫీల్డర్లే బౌండరీ రోప్ స్థానాన్ని మార్చేరని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బౌండరీ రోప్ సరైన స్థానంలో ఉంటే బంతి సిక్సర్ వెళ్లేదని, కుశాల్ మెండిస్ నాటౌట్‌ అయ్యేవాడని ట్వీట్ చేస్తున్నారు. అయితే బంతి ముందే అక్కడకు వస్తుందని ఫీల్డర్‌కు ఎలా తెలుస్తుందని మరి కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. మెండిస్ బంతి అక్కడకు కొడతాడని ఊహించి బౌండరీ రోప్ మారుస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తీరులో బౌండరీ రోప్ జరిగినట్లు కనిపించింది. ఆ ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. 



 ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ ముందు 345 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది శ్రీలంక. అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత సెంచరీలతో 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసి జట్టను విజయతీరాలకు చేర్చారు. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద పరుగుల ఛేజింగ్. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించలేకపోయింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు 8 సార్లు తలపడగా, ప్రతిసారీ పాక్ జట్టు శ్రీలంకను ఓడించింది. ఈసారి కూడా శ్రీలంకపై పాక్ విజయ పరంపర కొనసాగింది.