దేశంలో క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులకు తగిన గుర్తింపునిచ్చేందుకు యువజన, క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏటా పలు అవార్డులను ప్రదానం చేస్తుంది. వీటిలో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు ముఖ్యమైనవి. వీటిని ఏటా ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి అయిన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29 న ప్రదానం చేస్తారు.
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సాధించిన భారత క్రీడాకారులను ప్రభుత్వం ఏటా ధ్యాన్ చంద్ అవార్డుతో సత్కరిస్తోంది. విజేతలకు శిల్పం, సర్టిఫికెట్ పాటు రూ.5 లక్షల నగదును బహుకరిస్తారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించడానికి యువజన, క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1961 నుంచి అర్జున అవార్డును ప్రదానం చేస్తుంది. అవార్డు గ్రహీతలను అర్జునుడి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదుతో సత్కరిస్తారు. గడిచిన నాలుగేళ్లలో మంచి క్రీడా ప్రతిభను కనబర్చటమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కలిగిని వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో పతక విజేతలను తయారుచేసిన ఉత్తమ క్రీడా శిక్షకులకు 1985 సంవత్సరం నుంచి ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తున్నారు. విజేతలకు ద్రోణాచార్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.7 లక్షల నగదును బహుకరిస్తారు.
క్రీడా అవార్డులకు ఎంపికైన నామినీల జాబితా
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్);
అర్జున: షమి (క్రికెట్), అజయ్ రెడ్డి (అంధుల క్రికెట్), హుస్సాముద్దీన్ (బాక్సింగ్), ఓజాస్, అదితి గోపీచంద్ (ఆర్చరీ), శీతల్ దేవి (పారా ఆర్చర్), పారుల్ చౌదరి, శ్రీశంకర్ (అథ్లెటిక్స్), వైశాలి (చెస్), దివ్యక్రితి సింగ్, అనూష్ (ఈక్వెస్ట్రియన్), దీక్షా డాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్, సుశీలా చాను (హాకీ), పింకీ (లాన్‌బాల్), ఐశ్వరీప్రతాప్ సింగ్ (షూటింగ్), అంతిమ్ ఫంగల్ (రెజ్లింగ్), ఐహికా ముఖర్జీ (టీటీ).
ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం: కవిత (కబడ్డీ), మంజూష కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్‌కుమార్ (హాకీ);
ద్రోణాచార్య: గణేశ్ (మల్లఖంబ్), మహవీర్ సైనీ (పారా అథ్లెటిక్స్), లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్‌బీ రమేశ్ (చెస్), శివేంద్రసింగ్ (హాకీ).
దేశంలో క్రీడా పురస్కారాల ఎంపికకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్‌ను ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై, ఒలింపియన్ బాక్సర్ అఖిల్ కుమార్, షూటర్ సుమా శిరుర్, టేబుల్ టెన్నిస్ దిగ్గజం కమలేష్ మెహతా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, షట్లర్ తృప్తి ముర్గుండే, ఫర్మాన్ బాషా, అభిషేక్ త్రిపాఠి, సాయ్ డీజీ సందీప్ ప్రధాన్, టాప్స్ పథకం సీఈఓ పుష్పేంద్ర గార్గ్, క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ప్రేమ్‌కుమార్ ఝా కమిటీలో ఉన్నారు. ఈ సభ్యులతో ఉన్న కమిటీ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఆటగాళ్లను ఎంపిక చేయనుంది.
భారత్‌లో క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడలు వంటి పలు అంతర్జాతీయ టోర్నీల్లో గత నాలుగేళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తిగత క్రీడాకారులు లేదా టీమ్‌కు దీనిని ప్రదానం చేస్తారు. అవార్డు కింద, మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.7.5 లక్షలు నగదు ను బహుకరిస్తారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మొదటి అవార్డును స్వీకరించగా ఇప్పటివరకు దాదాపు 34 మందికి దీనిని బహుకరించారు.