ఐదు గంటల పాటు హోరాహోరీగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫ్రెంచ్ దిగ్గజం రఫెల్ నాదల్ విజయం సాధించాడు. 6-2, 7-6, 6-4, 6-4, 7-6తో ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదేవ్‌పై.. రఫెల్ నాదల్ విజయం సాధించాడు. ఇది నాదల్‌కు 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్. చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన రోజర్ ఫెదెరర్, నోవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా రఫెల్ నాదల్ నిలిచాడు. నాదల్ గెలిచిన 21 గ్రాండ్‌స్లామ్‌ల్లో ఇది కేవలం రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రమే. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాక మళ్లీ ఇక్కడ నాదల్ కప్పు కొట్టిందే లేదు. సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో నాదల్ అత్యధిక గ్రాండ్ స్లామ్‌ల చరిత్ర కూడా సృష్టించడం విశేషం.


45 నిమిషాల పాటు సాగిన మొదటి సెట్‌లో మెద్వెదేవ్ 6-2తో విజయం సాధించాడు. 1-2తో వెనుకబడ్డ దశ నుంచి మెద్వెదేవ్ వరుసగా ఐదు గేమ్‌లను గెలుచుకుని ఈ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మొదట నాదల్ ఆధిక్యాన్ని ప్రదర్శించినా తర్వాత వరుస తప్పిదాలతో మెద్వెదేవ్‌కు ఈ సెట్‌ను సమర్పించుకున్నాడు.


రెండో సెట్ మాత్రం ఏకంగా గంటన్నర పాటు సాగింది. టై బ్రేకర్ దాకా వెళ్లిన ఈ సెట్‌లో 7-6తో మెద్వెదేవ్ విజయం సాధించాడు. మొదటి సెట్ తరహాలోనే 4-1తో ముందంజ వేసిన నాదల్ తర్వాత వరుస తప్పిదాలతో ఈ సెట్‌ను కూడా కోల్పోయాడు. 


ఇక మ్యాచ్‌లో గెలవాలంటే నిలవాలంటే తప్పక గెలవాల్సిన సెట్‌లో నాదల్ విజృంభించాడు. మూడో సెట్‌లో 6-4తో విజయం సాధించాడు. ఈ సెట్ కూడా దాదాపు గంట సేపు సాగింది. ఇద్దరూ 4-4తో సమానంగా ఉన్న దశలో వరుసగా రెండు గేమ్‌లు గెలుచుకుని నాదల్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు.


నాలుగో సెట్ కూడా గంట సేపే సాగింది. సరిగ్గా మూడో సెట్ తరహాలోనే ఈ సెట్‌ను కూడా నాదల్ 6-4తో గెలుచుకున్నాడు. దీంతో ఇద్దరూ చెరో రెండు సెట్లలో విజయం సాధించి 2-2తో సమాన ఆధిక్యంలోకి వచ్చారు.


నిర్ణయాత్మక ఐదో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. దాదాపు గంటా 10 నిమిషాల పాటు సాగిన ఐదో సెట్‌లో నాదల్ 7-6తో విజయం సాధించాడు. దీంతో మ్యాచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండూ నాదల్ సొంతం అయ్యాయి. ఇది నాదల్‌కు 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 25 సంవత్సరాల మెద్వెదేవ్‌పై.. 35 సంవత్సరాల నాదల్ ఐదు గంటలకు పైగా పోరాడి మ్యాచ్ గెలవడం నాదల్ ఫిట్‌నెస్ లెవల్స్‌ను తెలుపుతుంది.