కస్టమర్లను ఆకర్షించడంలో హోటల్ యాజమాన్యాలలో ఒక్కొక్కరిది ఒక్కొ స్టైల్. ఒకరు రోబో సర్వర్లను పెడితే మరొకరు టాయ్ ట్రైన్ సర్వర్లను ఏర్పాటు చేస్తారు. ఇక బిల్లులపై ఆఫర్లు అయితే మరీ వింతగా ఉంటాయి. తాము అందించే ఆహారాన్ని పూర్తిగా తింటే బిల్లు కట్టక్కర్లేదని ఒకరు. ఫుడ్ నచ్చకపోతే బిల్లు వాపస్ అని మరొకరు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి కొత్త కాన్సెప్ట్ ను పట్టిందో నెల్లూరు చాట్ భాండార్. తిన్న తర్వాత డైస్ వేస్తే అందులో వచ్చే నెంబర్ ద్వారా బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు. కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాదండోయ్ చాట్ కూడా టేస్టీగా ఉంటుందంటున్నారు. 



డైస్ కాన్సెప్ట్ ఆఫర్ 


కస్టమర్లను ఆకర్షించడంలో నెల్లూరోళ్ల స్టైలే వేరు. అవునండీ నెల్లూరు హోటల్స్ లో రకరకాల వెరైటీ కాన్సెప్ట్ లు ఇప్పుడు మనకు కనపడుతుంటాయి. అలాంటి ఓ చాట్ స్పెషల్ ఈ రబ్జింకి. నెల్లూరు చిల్ర్డన్స్ పార్క్ లైన్లో ఉన్న ఈ రబ్జింకి చాట్ స్పెషల్.. నిజంగా నెల్లూరుకే ఓ స్పెషల్. చాట్ తిని బిల్లు కట్టే సమయంలో మీకొక అద్భుతమైన ఆఫర్ ఇస్తారు. పాచికలు, అంటే డైస్ వేసి మనకు ఎంత డిస్కౌంట్ వస్తుందో, మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవచ్చనమాట. డైస్ వేస్తే మనకి 12 నెంబర్ పడితే అదృష్టం తన్నుకొచ్చినట్టే, అంటే పూర్తిగా  ఆ బిల్లు మాఫీ అయిపోతుంది. 11 నెంబర్ పడితే బిల్లులో యాభైశాతం రాయితీ, 10వ నెంబర్ పడితే మాత్రం 25 శాతం రాయితీ ఇస్తారు. ప్రతి 100 రూపాయల బిల్లుకి ఇలా ఒకసారి డైస్ వేసే ఛాన్స్ ఇస్తారు. 


టేస్ట్ కి తిరుగేలేదు 


ఇక టేస్ట్ విషయంలో ఇక్కడ తిరుగే లేదు అంటున్నారు కస్టమర్లు. నెల్లూరులో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న చాట్ భాండార్ ఇదే. రబ్జింకి అనే వెరైటీ పేరుతో అందర్నీ ఆకట్టుకుంటున్నామని, డైస్ కాన్సెప్ట్ తో మంచి ప్రచారం వచ్చిందని, తమ హోటల్ కి వచ్చేవారికి ఆరోగ్యకరమైన ఫుడ్ ఐటమ్స్ అందిస్తుంటామని నిర్వాహకులు అంటున్నారు. వంటల్లో వాడే నూనె, నెయ్యి, వెన్న.. ఇలా ఏ వస్తువులోనూ రాజీపడబోమని చెబుతున్నారు. ప్రతిరోజూ కస్టమర్లకు రూ.2 వేల వరకు డిస్కౌంట్లు ఇస్తుంటామని చెబుతున్నారు. 


కాన్సెప్ట్ తో పాటు టేస్ట్ సూపర్


నెల్లూరులో డైస్ కాన్సెప్ట్ బాగా క్లిక్ అవుతోంది. ప్రతి కస్టమర్ కి ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుండే సరికి చాలామంది కనీసం ఒక్కసారైనా ఈ హోటల్ కి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్నారు. ఒకసారి టేస్ట్ చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ రావాల్సిందేనంటున్నారు. 


Also Read: ఆహారం అరగడం లేదా... రోజుకో కాఫీ తాగితే చాలు